తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fixed Deposits : ఫిక్సిడ్‌ డిపాజిట్లు మారుస్తున్నారా… ఇవి మర్చిపోకండి…..

Fixed Deposits : ఫిక్సిడ్‌ డిపాజిట్లు మారుస్తున్నారా… ఇవి మర్చిపోకండి…..

HT Telugu Desk HT Telugu

11 November 2022, 14:50 IST

    • Fixed Deposits ఈ మధ‌్య కాలంలో బ్యాంకు వడ్డీ రేట్లు మారాయి.  దీర్ఘ కాలిక ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీల్లో కొన్ని బ్యాంకులు 1శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో చాలామంది వడ్డీ అదనంగా వస్తుందనే ఉద్దేశంతో పాత బాండ్లను రద్దు చేసి కొత్త డిపాజిట్లు చేస్తున్నారు. అలా చేసే ముందు ఈ జాగ్రత్తలు మర్చిపోకండి….
ఫిక్సిడ్ డిపాజిట్‌లు మారుస్తుంటే జాగ్రత్త....
ఫిక్సిడ్ డిపాజిట్‌లు మారుస్తుంటే జాగ్రత్త.... (MINT_PRINT)

ఫిక్సిడ్ డిపాజిట్‌లు మారుస్తుంటే జాగ్రత్త....

Fixed Deposits బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేస్తే తక్కువ వడ్డీ వచ్చినా సురక్షితంగా ఉంటాయనే నమ్మకం వేతన జీవులకు ఉంటుంది. మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు, వేతన జీవులు ఎక్కువగా పొదుపు చేసే మొత్తాలను బ్యాంకు డిపాజిట్లలోనే దాచుకుంటూ ఉంటారు. ఇటీవల పలు జాతీయ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. గతంలో ఐదేళ్ల వ్యవధికి చేసే ఫిక్సిడ్ డిపాజిట్లకు గరిష్టంగా 6.5శాతం వడ్డీ చెల్లించేవారు. ఇటీవల సీనియర్ సిటిజన్లకు, బ్యాంకు ఉద్యోగులకు అదనంగా ఒక శాతం వడ్డీ చెల్లించనున్నట్లు ఓ జాతీయ బ్యాంకు ప్రకటించింది.

రూ.5లక్షల నగదును 6.5శాతం వడ్డీకి ఐదేళ్ల కాలానికి ఓ రిటైర్డ్‌ ఉద్యోగి బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంటే 60 నెలల తర్వాత అతనికి 6.5శాతం వడ్డీతో దాదాపు రూ.1,62,500 రుపాయలు అదనంగా లభిస్తాయి. బ్యాంకు అదనంగా 1శాతం వడ్డీ చెల్లింపు ప్రకటించేసరికి అదనంగా నగదు వస్తుందని భావించిన ఉద్యోగి పాత డిపాజిట్‌లను రద్దు చేసి కొత్త వడ్డీకి డిపాజిట్‌ చేసుకున్నాడు.

జాతీయ బ్యాంకులు గడువుకు ముందే నగదు డిపాజిట్లను రద్దు చేస్తే ముందు హామీ ఇచ్చిన వడ్డీలో ఒకశాతం మినహాయించుకుంటాయి. ఫిక్సిడ్ డిపాజిట్ బాండ్లపై వార్షిక తరుగు నిబంధనలు స్పష్టంగా ముద్రిస్తారు. 7.5శాతం వడ్డీకి ఆశపడిన రిటైర్డ్ ఉద్యోగి ఒకరు దాదాపు మూడేళ్ల రెండు నెలల తర్వాత తన ఫిక్సిడ్ డిపాజిట్‌ గత నెలలో రద్దు చేసుకున్నాడు. ఏడాదికి 6.5శాతం వడ్డీ చొప్పున ఏడాదికి రూ.32,500 వస్తాయని భావించాడు. కానీ వడ్డీ శాతాన్ని బ్యాంకు 5.5శాతంగా లెక్కించడంతో అతనికి రావాల్సిన మొత్తంలో భారీగా కోత పడింది.

38 నెలల తర్వాత ఫిక్సిడ్ డిపాజిట్ రద్దు చేసుకున్న డిపాజిట్ దారుడు మిగిలిన 22నెలల కాలానికి 7.5శాతం వడ్డీకి ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత తీరిగ్గా లెక్కలు వేసుకోవడంతో దాదాపు రూ.15వేలకు పైగా తేడా రావడంతో ఖంగుతిన్నాడు. వార్షిక తరుగును బ్యాంకు కంప్యూటర్లు ఆటోమెటిక్‌గా లెక్కించడంతో ఐదేళ్ల ఫిక్సిడ్ డిపాజిట్ మీద రావాల్సిన వడ్డీ కంటే అసలు, వడ్డీ రెండు తగ్గిపోయాయి. బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్‌లను రద్దు చేసుకునే సమయంలో మూడేళ్ల రెండు నెలల కాలానికి వచ్చిన వడ్డీతో కలిపినా కూడా కొత్త వడ్డీ రేటులో డిపాజిట్‌దారుడికి రావాల్సిన మొత్తం తగ్గడం గమనార్హం.

బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లను గడువుకు ముందు రద్దు చేసుకోవాలనుకుంటే వడ్డీ హామీను కూడా వదులుకోవాల్సి ఉంటుందన్నమాట. పాత వడ్డీకంటే కొత్త వడ్డీ ఆకర్షణీయంగా ఉన్నా ఖచ్చితంగా లెక్కలేసుకున్న తర్వాత పాత బాండ్లను కదపకపోవడం ఉత్తమం.