తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  War Of Words Between Hidupur Mla Nandamuri Balakrishna And Narasarao Pet Mla Gopireddy Srinivasa Reddy

NBK Vs Gopireddy: పేట ఎమ్మెల్యేకు బాలయ్య వార్నింగ్..కౌంటర్ ఇచ్చిన గోపిరెడ్డి

HT Telugu Desk HT Telugu

16 March 2023, 7:36 IST

    • NBK Vs Gopireddy: నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి ఎమ్మెల్యే కూడా స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ కూడా మామూలు మనిషేనని, నిజాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. 
నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ

'NBK Vs Gopireddy: సినీనటుడు నందమూరి బాలకృష్ణ నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య.. నరసరావుపేటలో తన పాటలు వేసినందుకు స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంపై బాలకృష్ణ మండిపడ్డారు. బాగా చదువు కున్నానని, ప్రజాసేవ చేస్తున్నానని చెబుతున్నావని, ఆ పని చేయాలని, సినిమాలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడొద్దని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ .. నరసరావు పేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు శ్రీనివాసరెడ్డికి హితవు పలికారు.

గుంటూరు జిల్లా తెనాలి పెమ్మసాని థియేటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ఓ వేడుకలో వస్తున్న తన పాటని తొలగించమని అక్కడి స్థానిక ప్రజాప్రతినిధి కోరడాన్ని తప్పుపడుతూ బాలకృష్ణ ఘాటుగా విమర్శలు చేశారు. తాను తలచుకుంటే ఏం జరుగుతుందోనని ఘాటుగా ఆగ్రహం వ్యక్తంచ చేశారు. తన సినిమా పాటలపై ఆగ్రహం వ్యక్తం చేసి ప్రజాప్రతినిధి తన స్థాయిని దిగ జార్చుకున్నారని బాలకృష్ణ విమర్శించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, లేకపోతే వేరేలా ఉంటుందని హెచ్చరించారు. అభిమానులు సినిమాలు బాగుంటే చూస్తారని లేకపోతే చూడరని పేర్కొన్నారు.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మూర్ఖుడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో యథారాజ తథాప్రజ అన్నట్లు తయారైందన్నారు. సినిమాలను సినిమాలుగా మాత్రమే చూడాలని ఎమ్మెల్యేకు బాలకృష్ణ సూచించారు.

ఏమి జరిగిందంటే….

నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ ఇటీవలే ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇందులో భాస్కర్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త నందమూరి బాలకృష్ణ నటించిన ఓ సినిమాలోని పాటను ప్లే చేశారు. ఇది గోపిరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. బాలకృష్ణ పాట వేయొద్దని ఆ కార్యకర్తను ఆదేశించారు. దాన్ని తొలగించాలని సూచించారు. ఇది బాలకృష్ణ దృష్టికి వెళ్లడంతో తెనాలి సభలో ప్రస్తావించారు.

ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సినిమాలను సినిమాగా చూడాలని రాజకీయాలను జొప్పించకూడదని అన్నారు. సినిమా ఏ కులానికో, మతానికో సంబంధించినది కాదని చెప్పారు. సినిమాలను అందరూ చూస్తారని, అన్ని కులాలవారు, మతాలవారిని ఒకేచోటికి చేర్చే శక్తి సినిమాకు ఉందని పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని సినిమా ప్రపంచం ఏకం చేస్తుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

సినిమాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బాలకృష్ణ అన్నారు. తాను ఒక్క చిటికె వేస్తే చాలని ఎమ్మెల్యేను హెచ్చరించారు. పెద్ద చదువులు చదివానని, ప్రజా సేవ చేస్తోన్నానని చెప్పుకొంటోన్నాడని, చేసుకోవాలని తాను ఒక్కసారి నేను మూడోకన్ను తెరిచానో.. మామూలుగా ఉండదని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సభలో తన సినిమా పాటలను తీసేయాలనేంత నీచానికి దిగజారడం సరికాదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని వార్నింగ్ ఇచ్చారు.

గోపిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్…

బాలకృష్ణ వ్యాఖ్యలపై గోపిరెడ్డి స్పందించారు. తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరని ప్రశ్నించారు. బాలయ్య పెద్ద హీరో అయితే అది టీడీపీకి గొప్ప అని... తనకు కాదన్నారు. బాలకృష్ణ కూడా ఒక మనిషే అనే విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. అక్కడ ఏమి జరిగిందో వాస్తవాలను తెలుసుకుని బాలయ్య మాట్లాడాలని సూచించారు. సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో కూడా నటించడం కుదరదనే సంగతి బాలకృష్ణ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

టాపిక్