తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Train Accident : రెండు రైళ్లలో 316 మంది ఏపీ వాసులు సేఫ్, 141 మంది ఫోన్లు స్విచ్ఛాప్- మంత్రి బొత్స

Train Accident : రెండు రైళ్లలో 316 మంది ఏపీ వాసులు సేఫ్, 141 మంది ఫోన్లు స్విచ్ఛాప్- మంత్రి బొత్స

03 June 2023, 19:34 IST

    • Minister Botsa On Train Accident : కోరమాండల్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఏపీ ప్రయాణికుల వివరాలు సేకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వీరిలో 316 మంది సురక్షితంగా ఉన్నారని, మిస్సైన వారి కోసం వివరాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa On Train Accident : ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. సమావేశం తర్వాత మంత్రి బొత్స మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌ ఈ ఘటనపై నిరంతరం సమీక్ష చేస్తున్నారని తెలిపారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారన్నారు. మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బృందాన్ని ఒడిశాకు పంపించారని తెలిపారు. కోరమాండల్‌ సహా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్న ఏపీ వాసుల వివరాలు సేకరిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు ఆగే స్టేషన్ల నుంచి ప్రయాణికుల సమాచారాన్ని సేకరించామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

కోరమాండల్ లో 267 మంది సురక్షితం

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామని మంత్రి బొత్స తెలిపారు. వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు అయిదుగురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారన్నారు. వీరందరి ఫోన్‌ నంబర్లకు ఫోన్లు చేసి వారిని ట్రేస్‌ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 267 మంది సురక్షితంగా ఉన్నారని తెలిసిందన్నారు. 20 మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయని తెలిసిందన్నారు. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నట్టు వెల్లడైందన్నారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అవ్వడంతో …వారి వివరాలు తెలియలేదని, మిగిలిన వారిని ట్రేస్ చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో 89 మంది ఏపీ వాసులు

అలాగే హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీ నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నారని మంత్రి బొత్స తెలిపారు. విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి ముగ్గురు ఉన్నారన్నారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇద్దరికి స్వలంగా గాయాలు అయ్యాయన్నారు. 10 మంది ట్రైన్ ఎక్కలేదన్నారు. 28 మంది ఫోన్లు ఎత్తకపోవడం లేదా స్విచాఫ్‌ అవ్వడంతో వీరి వివరాలను సేకరించడంపై దృష్టిపెట్టామని మంత్రి తెలిపారు.

ఏపీ ప్రయాణికులు చనిపోయారని నిర్థారిత సమాచారం లేదు

"ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకు ఉన్న ఆస్పత్రులను అలర్ట్‌ చేశాం. గాయపడ్డవారు ఎవరు వచ్చినా.. వారికి చికిత్స అందిస్తాం. విశాఖకు చేరుకున్న గాయపడ్డ ప్రయాణికులు ఇద్దరిని వెంటనే సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చేర్పించాం. వీరిలో ఒకరి తలకు, మరొకరికి వెన్నుపూసకు గాయం అయ్యింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఒడిశాకు 108 అంబులెన్స్‌లు 25, ప్రైవేటు అంబులెన్స్‌లు 25 మొత్తంగా 50 అంబులెన్స్‌లు పంపించాం. ఇవికాకుండా ఎమర్జెన్సీ కార్యకలాపాల కోసం ఒక ఛాపర్‌ను కూడా సిద్ధంచేశాం. అవసరమైతే క్షతగాత్రులను ఎయిర్‌లిఫ్ట్ చేస్తాం. నేవీ సహకారం కూడా తీసుకుంటున్నాం. ఏపీకి చెందిన ప్రయాణికులు చనిపోయారని నిర్ధారిత సమాచారం ఏం లేదు. సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి.. ఇంకా ఏం నిర్ధారించలేం. కానీ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం టైం టు టైం సమీక్ష చేస్తున్నారు. పేషెంట్లను అవసరమైతే భువనేశ్వర్‌ అపోలోలో చేర్పించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు అపోలో ఆస్పత్రితో మాట్లాడాం. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎవరైనా తమ వారి సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు అందించాలని కోరుతున్నాం" - మంత్రి బొత్స