Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు
03 May 2024, 6:08 IST
- Maddalachervu Suri: రాయలసమీ రక్తచరిత్రలో భాగమైన మద్దలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఖరారు చేసింది.
పరిటాల రవి హత్య కేసు నిందితుడు భానుకిరణ్
Maddalachervu Suri: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్దలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య తర్వాత, రవి ప్రత్యర్ధి అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరిని అనుచరుడు కారులోనే హతమార్చాడు.
యూసఫ్‌గూడ మీదుగా వెళుతున్న కారులో వెనుక సీటులో కూర్చున్న నిందితుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో సూరిని తలపై కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ చరిత్రలో ఓ అధ్యాయం సూరి హత్యతో ముగిసింది.
ఈ హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెలచెర్వు సూరి 2011 జనవరిలో హత్యకు గురయ్యారు. సూరి జైల్లో ఉన్న సమయంలో వసూలు చేసిన డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన వివాదంతో అనుచరుడే హత్య చేసినట్టు ప్రచారం జరిగింది. సూరిని పథకం ప్రకారమే హత్య చేయించారని సూరి భార్య గంగుల భానుమతి ఆరోపించారు.
సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ‌్ యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018 డిసెంబరులో కింది కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు సవాలు చేస్తూ భాను హైకోర్టులో అప్పీలు చేశాడు. నిందితుడి పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
సూరిని హత్య చేసిన భాను తరఫు న్యాయవాది పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా దిగువ కోర్టు జైలు శిక్ష విధించిందని, సాక్ష్యం ఇచ్చిన వారు ఇద్దరూ అనుమానితులేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పిటిషనర్ స్వయంగా రివాల్వర్, పిస్టల్ వినియోగించినట్లు కూడా నిరూపించలేదని వాదించారు. హత్య జరిగిన సమయంలో వెనుక సీట్లో కూర్చున్న నిందితుడు కాల్పులు జరిపిన తర్వాత ఎటాక్ జరిగిందని అరవడంతో డ్రైవర్ కారును ఆపేడంతో నిందితుడు పరారయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ సూరిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనా స్థలం నుంచి పరారయ్యాడనే విషయాన్ని మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుందని, ఈ ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉటంకించారు. ఘటనా స్థలంలో ఉన్న సాక్షులు కూడా పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చారని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు పిటిషనర్ వాదనలను తోసిపుచ్చారు. భానుకిరణ్ పథకం ప్రకారం సూరిని హత్య చేశారని స్పష్టం చేశారు.
హత్య జరిగిన రోజున సూరితో పాటు భాను కూడా అదే కారులో ప్రయాణించాడని వివరించారు. వెనుక సీట్లో కూర్చుని పథకం ప్రకారమే తలపై కాల్చి చంపారని వివరించారు. హత్య చేసిన తరువాత మధ్యప్రదేశ్ పారిపోయారని, నిందితుడిని గాలించి పట్టుకున్నారని కోర్టుకు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం భాను అప్పీలును కొట్టివేసింది.