AP Welfare Schemes : సంక్షేమ పథకాల నగదు జమలో జాప్యం, లబ్ధిదారుల ఎదురుచూపులు!
26 May 2024, 16:05 IST
- AP Welfare Schemes : ఏపీలో ఎన్నికల కోడ్ మొదలవ్వక ముందే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల బటన్లు నొక్కింది. అయితే కోడ్ అమల్లోకి రావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత నిధులు జమ చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. అయితే ఇప్పటికీ సంక్షేమ పథకాలు డబ్బులు జమ కాలేదని లబ్దిదారులు అంటున్నారు.
సంక్షేమ పథకాల నగదు జమలో జాప్యం, లబ్ధిదారుల ఎదురుచూపులు!
AP Welfare Schemes : రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో నాలుగు సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంలో జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తుందోనని నాలుగు పథకాల లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేసే డీబీటీ నిధులు ఆగిపోయాయి. దీనిపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఎన్నికల్లో అది సంచలనం అయింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ముగిసిన తర్వాత సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయొచ్చని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అయింది.
సంక్షేమ పథకాల నిధులు
ఈ నేపథ్యంలోనే వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులుగా ఉన్న వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతున్నాయి. దీంతో పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి నాలుగు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.5,868 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. అయితే ఈ రూ.5,868 కోట్లను వివిధ పథకాల కింద లబ్ధిదారులకు అందించింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ. 1,843 కోట్లు జమ చేశారు. ఇక రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లోకి రూ. 1,236 కోట్లు వేశారు. మరోవైపు.. వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1,552 కోట్లను లబ్ధిదారుల అకౌంట్లలో వేశారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమ చేశారు. జగనన్న విద్య దీవెన పథకం కింద లబ్ధిదారులైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ కింద రూ.605 కోట్లు అకౌంట్లలో వేశారు.
ప్రభుత్వ ఖజానాలో నిధులు లేక
ఇంత వరకు బాగానే ఉంది. అయితే లబ్ధిదారులు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇంతవరకు అత్యధిక మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అయితే ఉన్నతాధికారులు మాత్రం తాము డబ్బులు జమ చేశామనే చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే, బ్యాంకు ఖాతాల్లో వేశారు కానీ, ప్రభుత్వ ఖజానాలో సరిపడినన్ని నిధులు లేవని తెలుస్తుంది. అందువల్లే లబ్ధిదారులు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.
అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల ముందు సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత జనవరి నుంచి మార్చి వరకు వివిధ పథకాలకు నిధుల విడుదల చేసేందుకు సీఎం జగన్ బటన్ నొక్కారు. అయితే ఆ పథకాలకు నిధులు మాత్రం జమ కాలేదు. సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధుల విడుదల చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేస్తూ ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో నష్టపోతున్నామని, పాత పథకాలకే నిధులు విడుదల కాలేదని పలువురు లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మే 10వ తేదీన ఒక్క రోజు మాత్రమే నిధులు విడుదల చేయాలని 9వ తేదీ రాత్రి హైకోర్టు తీర్పునిచ్చింది. 10వ తేదీన డివిజన్ బెంచ్‌లో సింగల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ క్రమంలో నిధులు విడుదల చేయడంపై ఈసీ అభ్యంతరం చెప్పింది. పోలింగ్ ముందు నిధుల పంపిణీ సరికాదని, ఓటర్లను ప్రభావితం చేయడమేనని అభ్యంతరం తెలిపింది. 10వ తేదీ వాదనలు ముగిసే సమయానికి నగదు బదిలీ కాలేదు. దీంతో పోలింగ్ ముగిసే వరకు డబ్బులు పంపిణీ చేయొద్దని హైకోర్టు సీజే ఆదేశించారు. సింగల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వచ్చే జూన్‌లో ఈ వ్యవహారంపై విచారణ జరపుతామని కేసు విచారణ వాయిదా వేశారు. హైకోర్టు విచారణ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మే 10న మరింత స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. సింగల్ జడ్జి తీర్పు గడువు ముగిసిపోవడంతో పాటు నగదు బదిలీపై స్పష్టమైన ఆదేశాలు లేవని పోలింగ్ ముగిసే వరకు నగదు విడుదల చేయొద్దని ఆదేశించింది. దీంతో ఆర్దిక శాఖ నగదు బదిలీకి సిద్ధమైనా చివరి నిమిషంలో నిలిపివేసింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు