Voters For Cash: డబ్బులు అందలేదని ఓటర్ల ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభ్యర్థుల ఇళ్ల ముట్టడి-voters concern about not receiving money candidates were besieged in many places ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Voters For Cash: డబ్బులు అందలేదని ఓటర్ల ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభ్యర్థుల ఇళ్ల ముట్టడి

Voters For Cash: డబ్బులు అందలేదని ఓటర్ల ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభ్యర్థుల ఇళ్ల ముట్టడి

Sarath chandra.B HT Telugu
May 13, 2024 05:58 AM IST

Voters For Cash: ఆంధ్రప్రదేశ్‌లో ముందెన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల కొనుగోలు యథేచ్ఛగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు డబ్బు పంపిణీలో చాలా ప్రాంతాల్లో నేతలు చేతివాటం ప్రదర్శించడంతో ఓటర్లు అభ్యర్థుల ఇళ్ళను ముట్టడించారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటి ముందు ఆందోళన
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటి ముందు ఆందోళన

Voters For Cash: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో కొత్త ట్రెండ్ కనిపించింది. మా డబ్బులెక్కడ అంటూ అభ్యర్థుల ఇళ్లను ఓటర్లు ముట్టడించారు. ఓటర్లకు పంచమని ప్రధాన పార్టీలు అభ్యర్థులకు పంపిన డబ్బుల్ని మాయం చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. గతానికి భిన్నంగా అన్ని ప్రధాన పార్టీలో నాలుగైదు రోజుల ముందే నగదు పంపిణీ ప్రారంభించారు. ఓటుకు రూ.1500 నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేశారు.

గెలుపు కోసం పోలింగ్‌కు వచ్చే ప్రతి ఓటరుకు నగదు చెల్లించేందుకు పార్టీలు సిద్ధపడ్డాయి. సగటున 70శాతం పోలింగ్ నమోదయ్యే కేంద్రాల్లో గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారందరిని గుర్తించి డబ్బులు చెల్లించినట్టు ఓ పార్టీ నాయకుడు తెలిపారు. 2019 ఎన్నికల్లో పోలింగ్‌కు వచ్చిన వారందరిని గుర్తించి పంపిణీ చేపట్టినట్టు వివరించారు. డబ్బు పంపిణీ విషయంలో ప్రధాన పార్టీలు పోటీలు పడ్డాయి. 25 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇదే తరహా ధోరణి కనిపించింది.

ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పార్టీలు పంచే డబ్బు కాస్త అటుఇటుగా 20వేల కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఇందులో ఒక్కో ప్రధాన పార్టీ ఓటర్లకు దాదాపుగా వేల కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి.పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో పార్టీలే అభ్యర్థుల తరపున నగదు పంపిణీ బాధ్యతలు కూడా చేపట్టాయి.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంత మేరకు ఖర్చు పెట్టగలరో చూసిన తర్వాతే టిక్కెట్లు ఇచ్చినట్టు నేతలు చెబుతున్నారు. డబ్బు పంపిణీ విషయంలో కొందరు అభ్యర్థులు వెనుకబడ్డారు.ప్రత్యర్థి చెల్లించే దానికంటే ఎక్కువ చెల్లించేందుకు చాలాచోట్ల పార్టీలు సిద్ధమయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలో ఓటుకు 1500 నుంచి 5 వేల వరకు చెల్లించారు. మంగళగిరి, పిఠాపురం వంటి నియోజక వర్గాల్లో రూ.4-5వేల రుపాయలు ఓటరుకు చెల్లించారు. ప్రతి నియోజక వర్గంలో 50 శాతం ఓటర్లకు డబ్బు పంచాలంటే రూ.4వేలు, 60 శాతానికి పంచాలి అంటే 3వేలు, మొత్తం ఓట్లలో 70 శాతం మంది ఓటర్లకు పంచాలి అంటే 2వేలు, 80శాతం ఓటర్లకు పంచాలి అంటే రూ.1500గా పార్టీలు ఫిక్స్ చేసినట్టు సమాచారం.

డబ్బు పంపకాల్లో చాలా నియోజక వర్గాల్లో తీవ్ర పోటీ ఉంది. గెలుపు మీద సందేహం ఉన్న స్థానాల్లో ఇప్పటికే డబ్బులు పంచిన చోట కూడా అవసరమైతే పోలింగ్ రోజు కూడా చెల్లించేందుకు రెడీ అయ్యారు. ఏపీ ఎన్నికల చరిత్రలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా 2024 ఏపీ ఎన్నికలు నిలుస్తాయి.

మంగళగిరిలో ప్రధాన పార్టీలు ఓటుకు 4వేలు చెల్లించినట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు మూడ్రోజుల ముందే పంపిణీ పూర్తి చేశారు. పిఠాపురంలో ఓటుకు ఐదారు వేల రుపాయలు చెల్లించారు. ప్రధానంగా మత్స్యకారులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఓట్లకు భారీగా చెల్లించారు. ఎన్నికల సంఘం పెద్దగా కట్టడి చేసిన దాఖలాలు కనిపించలేదు.

ఓటర్ల ఆందోళన....

నగదు పంపిణీలో చేతివాటం ప్రదర్శించారని ఆరోపిస్తూ పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు నగదు అందలేదంటూ అభ్యర‌్థలు ఇళ్లను ముట్టడించారు. పల్నాడు జిల్లాలో తమకు నగదు అందలేంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. పిఠాపురంలో కూడా ఈ పరిస్థితి కనిపించింది. తమకు ఇస్తామన్న డబ్బులు రాలేదని చెబుతూ ఓటర్లు ఆందోళనకు దిగారు. గతంలో పట్టణ ప్రాంతాల్లో ఉండే అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌస్‌ వంటి చోట్ల నగదు పంపిణీ ఉండేది కాదు. ఈ దఫా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ధోరణి కనిపించింది. డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోవాలని నాయకులు చేసిన ప్రకటనలే దీనికి కారణంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లకు అవసరమైన ఆర్వో వాటర్ ప్లాంట్లు, జనరేటర్లు కొనివ్వాలనే డిమాండ్లు కూడా వచ్చినట్టు సమాచారం.

ప్రకాశం జిల్లాలో కొందరికి రూ.5వేలు చెల్లించారనే వార్తలతో మిగిలిన వారు ఆందోళనకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా కొండెవరంలో కూడా ఈ పరిస్థితి కనిపించింది. విజయవాడలో ఓ ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు తమ పార్టీ అభ్యర్థుల తరపున కార్పొరేటర్లకు నగదు పంపిణీ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో కార్పొరేటర్‌‌కు రూ.50లక్షలు కేటాయించారు. చాలా ప్రాంతాల్లో కార్పొరేటర్లు చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. సదరు పార్టీ ఓటుకు రూ.1500చొప్పున నగరంలో పంపిణీ చేసింది.

మరోవైపు విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఎంపీ ఎంవివివి సత్యనారాయణ, మంగళగిరిలో మురుగుడు లావణ్య వంటి వారికి ఓటర్ల నుంచి నిరసన ఎదురైంది డబ్బుల కోసం స్థానిక ఓటర్లు అభ్యర్థుల ఇళ్ల వద్ద ఆందోళనకు దిగారు. ఎంవివి సత్యనారాయణ ఇంటికి లోపల నుంచి తాళం వేసుకుని ఉండిపోయారు. అమర్‌నాథ్‌ అనుచరులు డబ్బులు ఓటర్లకు పంచకుండా మాయం చేశారని స్థానికులు ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు డబ్బుల పంపిణీ చేపట్టినా వాటిని కట్టడి చేయడంలో మాత్రం ఎన్నికల వ్యవస్థలు విఫలం అయ్యాయి. చాలా చోట్ల వాటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలు ఈ తంతు చూస్తుండిపోయాయి.

WhatsApp channel

సంబంధిత కథనం