AP TS Elections : తెలుగు రాష్ట్రాల్లో పంపిణీలు షురూ, తాయిలాలనే నమ్ముకున్న పార్టీలు!
AP TS Elections : తెలుగు రాష్ట్రాల్లో ప్రచారపర్వం ముగుస్తుండడంతో....పంపిణీలు మొదలయ్యాయి. ఇప్పటికే ఏపీలో అధికార వైసీపీ పంపిణీ మొదలుపెట్టగా...ప్రతిపక్షాలు సైతం మేము తక్కువ కాదన్న స్థాయిలో తాయిలాలు సిద్ధం చేసింది. తాయిలాల కోసం ఓటర్ల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AP TS Elections : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వేసవిలో రెండు రకాల ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెరుగుతున్న ఎండలకు రాజకీయ వేడి కూడా తోడైంది. ప్రచార పర్వం ముగుస్తున్న తరుణంలో తాయిలాలకు తెరలేపారు నేతలు. ఆకాశమే హద్దుగా సంక్షేమ పథకాలు, బటన్ నొక్కడం, భవిష్యత్తుకు గ్యారంటీ, గ్యారంటీ కార్డులు వంటి వరాలు ప్రకటించిన జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పుడు చివరి దశలో హామీల కంటే తాయిలాలకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నాయి. ఆయా పార్టీల ప్రముఖ నేతలు పోటీ చేస్తున్న స్థానాలు మొదలుకొని అన్ని చోట్ల ఎవరెవరు ఎంత ఇస్తున్నారు అనే చర్చే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు తాయిలాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
తాయిలాల పోల్ మేనేజ్‌మెంట్
వివిధ పార్టీల అధినేతలు పోటీ చేస్తున్న పులివెందుల, కుప్పం, పిఠాపురం, రాజమండ్రి, కొడంగల్, గజ్వేల్, సికింద్రాబాద్ వంటి స్థానాల్లో కూడా పంపకాల పర్వం కొనసాగుతోంది. సాధారణంగా ప్రధాన నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో, వారు నేతృత్వం వహిస్తున్న సెగ్మంట్లలో ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉంటుందని, ఇక్కడ పంపిణీలు ఉండవనే భావన ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి అన్ని స్థానాల్లో వివిధ రూపాల్లో తాయిలాలు అందుతున్నాయి. వస్తువులు, డబ్బులు, మద్యం, స్పోర్ట్స్ కిట్, వాహనాలు వంటి తాయిలాల పంపిణీలే కాకుండా సొసైటీలకు, కాలనీలకు, అపార్ట్‌మెంట్లకు సదుపాయాలు వంటి భరోసా కల్పిస్తున్నారు కాబోయే మన ప్రజాప్రతినిధులు. ఈ పంపిణీలకు కుల సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, బస్తీ సంఘాలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. పంపిణీలే కాకుండా ఓటర్‌ను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. అన్ని పార్టీలు చివరి దశలో తాయిలాల పోల్ మేనేజ్‌మెంట్‌నే నమ్ముకున్నాయి.
ఏపీలో పంపిణీలు షురూ
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ తాయిలాల హడావుడి కొంత ఎక్కువగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో ఏపీలో ఏ వీధిలో చూసినా పంపిణీ చర్చలే జరుగుతున్నాయి. ఏపీలో తాయిలాలు కొత్త పంథాలో సాగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ ఓటర్ల కోసం పార్టీలు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఏయే జిల్లాల వారు ఎక్కువగా ఎక్కడ ఉంటారో, కుల సంఘాల ద్వారా తమ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో ఉన్నారో ఆరాతీసి, ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు వేసి డబ్బులిస్తామని ఓటర్లను రప్పిస్తున్నారు. ప్రయాణంలో వారికి సకల సదుపాయాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైపు వారి కుటుంబ సభ్యుల ద్వారా ఫోన్ నెంబర్లు సేకరించి ఓటుకి ఇంత ఇస్తామని ఆశపెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఏపీలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చేసి వచ్చి ఓటు వేయమని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్న ఘటనలున్నాయి.
వైసీపీలో నమ్మకం సన్నగిల్లిందా?
అధికార వైఎస్‌ఆర్‌సీపీ తాము అందజేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయని, ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాలు, వివిధ అభివృద్ధి పథకాలకు జగన్ బటన్ నొక్కడం కార్యక్రమాలతో అధికారం ఖాయమని చెప్పుకుంటున్నా వారిమీద వారికే విశ్వాసం కనిపించడం లేదు. ఏపీలో ఏ నియోజకవర్గంలో చూసినా అన్ని పార్టీల కంటే అధికార వైఎస్‌ఆర్‌సీపీ వారే అధికంగా తాయిలాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో రెండోసారి అధికారం ఖాయమంటున్న వైఎస్‌ఆర్‌సీపీలో నమ్మకం సన్నగిల్లిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంత వరకు పార్టీ అధినేతలు, కొందరు కీలక మంత్రులు పోటీ చేస్తున్న స్థానాల్లో వారికి తిరుగుండదు అనే ప్రచారం ఉండేది. అయితే ఇప్పుడు అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటాపోటీ వాతావరణం ఉండడంతో అంతర్గతంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో పార్టీకి అననుకూలత ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కేడర్‌కు తోడు వాలంటీర్లు కూడా తాయిలాల పంపిణీలో సహకరిస్తున్నారు.
కూటమి పార్టీలు తగ్గేదే లే
తాయిలాల విషయంలో ప్రతిపక్ష టీడీపీ`జనసేన`బీజేపీ కూటమి అధికార వైఎస్‌ఆర్‌సీపీ కంటే తక్కువేమి తినలేదు. భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్‌సిక్స్ వంటి హామీలతో ఊదరగొడుతున్నా వాటితోనే అందలమెక్కుతామనే నమ్మకం వారికి లేనట్టుంది. వైఎస్‌ఆర్‌సీపీతో పోటీ పడి తాయిలాలను పంపిణీ చేస్తున్నారు కూటమి నేతలు. సహజంగా అధికారంలో ఉన్న వారు ఎక్కువగానే ఇచ్చే అవకాశాలుంటాయి. అందుకే ప్రతిపక్ష పార్టీలు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఎంత పంపిణీ చేశారో తెలుసుకొని అందుకు తగ్గట్టు వారు కూడా ఇస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, అధికారంలోకి వచ్చేది తామే అని చెప్పుకుంటున్న కూటమి నేతలు కూడా ఈ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ బాటలోనే నడుస్తున్నారు.
ఏపీలో కాంగ్రెస్ సైతం
ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తామేమి తక్కువ కాదు అన్నట్టున్నారు. గతంలో ఘన చరిత్ర గల కాంగ్రెస్‌లోని కొందరు నేతలు గెలవకపోయినా పర్వాలేదు గౌరవ ప్రదమైన ఓట్లు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అధికార వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష కూటమి పార్టీలు ఇచ్చినంతా కాకపోయినా కొంత మేర తాయిలాలకు కాంగ్రెస్ వారూ సిద్ధమయ్యారు. పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులకు పంపిణీలు తలనొప్పిగా మారాయి. నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను లేదా తమ కూటమి అభ్యర్థుల ఖర్చులను, బాగోగులను కూడా వీరే పట్టించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మంట్లలోనైనా పరిస్థితి ఆశాజనకంగా లేకపోతే ఆ ప్రభావం పార్లమెంట్ నియోజకవర్గం ఫలితంపై పడే అవకాశాలు ఉండడంతో ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల కష్టాలు రెట్టింపవుతున్నాయి.
తెలంగాణలో ఇదీ పరిస్థితి
మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలు తమ పాలనకు రిఫరెండంగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. తాము ఆరు గ్యారెంటీలు ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రచారం చేస్తున్న అధికార కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో విజయంపై నమ్మకం సన్నగిల్లిన్నట్టుంది. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు మించి తాయిలాల పంపిణీకి తెరదీసింది కాంగ్రెస్. సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ గ్రామాలు మొదలుకొని పట్టణాలు, నగరాల్లో పంపిణీలు మొదలుపెట్టింది.
బీఆర్ఎస్ కు అగ్ని పరీక్ష
గత అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు ముందు ఉప ఎన్నికల్లో తాయిలాలు అందించడంలో ముందున్న బీఆర్‌ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడిరది. ఓటమి తర్వాత ఒక్కసారిగా చుట్టుముట్టిన పలు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. పట్టున్న నియోజకవర్గాల్లో తమ బలం నిలుపుకోవడం కోసం అక్కడ పంపిణీకి తెరలేపింది బీఆర్‌ఎస్. మోదీ గ్యారెంటీ, కేంద్రం రాష్ట్రానికి చాలా చేసిందని ప్రచారం చేసుకునే బీజేపీ తామే కాంగ్రెస్‌కు అసలైన పోటీదారులమని, అధిక స్థానాలు గెలుస్తామని చెప్పుకుంటున్నా వారిపై వారికే నమ్మకం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రకమైన ప్రచారంతో చతికిలపడ్డ బీజేపీ ఇప్పుడు పలు రూపాల్లో ఓటర్లకు తాయిలాలు అందజేస్తోంది.
భారీగా పోస్టల్ ఓటింగ్
రెండు రాష్ట్రాల్లో చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పోస్టల్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఏపీలో 2019 ఎన్నికల కంటే 2024లో రెట్టింపు సంఖ్యలో దాదాపు 5 లక్షల మంది పోస్టల్ ఓటింగ్ వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న 90 శాతం మంది ఉద్యోగులే ! ఈ పోస్టల్ బ్యాలెట్‌లో పాల్గొన్న ఉద్యోగుల్లో కొందరు ఓటుకు నోటు తీసుకొని ఆయా పార్టీలకు ఓట్లు వేయడం దురదృష్టకరం. ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాల్సిన ఉద్యోగుల్లో కొందరు తాయిలాలకు, డబ్బులకు లొంగడం మచ్చగానే మిగిలిపోతుంది.
ఫిక్స్ అయిన పార్టీకే ఓట్లు
ఒక పార్టీ నుంచి తాయిలాలు, డబ్బులు తీసుకున్నవారందరూ ఆ పార్టీలకే ఓటు వేస్తారా? అనేది సందేహమే. గతంలో తెలంగాణలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఏరులై పారడం బహిరంగ రహస్యమే. ఇటీవల తెలంగాణలో ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ కేసులో బట్టబయలు కావడం తెలిసిందే. బీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులిచ్చినా దుబ్బాక, హుజూరాబాద్‌లో పరాజయం పాలైంది. మునుగోడులో చచ్చి బతికింది. వీటిని ఉదాహరణగా తీసుకుంటే ప్రజలు ఏ పార్టీకి ఓటేయాలో ముందస్తుగానే నిర్దారణకు వచ్చేస్తారు. పార్టీలు ఇస్తామంటే ఎందుకు వద్దనాలి అని తాయిలాలు తీసుకొని తమకి నన్చిన వారికే ఓటేస్తారు. రాజకీయల పార్టీలకు వారిపై వారికి అపనమ్మకంతో పెద్ద ఎత్తున తాయిలాలకు తెరలేపుతున్నాయి.
పరాకాష్టకు తాయిలాల పంపిణీ
ఈ తాయిలాల పంపిణీ ఎంత పరాకాష్టకు చేరిందంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు ముందరి ఉప ఎన్నికల్లో కొన్ని గ్రామాల వారు ‘పక్క గ్రామాల వారికి మాకంటే ఎక్కువ డబ్బులిచ్చారు’ అంటూ నిరసనలకు దిగారు. డబ్బులు రాలేదని కొన్ని గ్రామాల వారు ఎన్నికలను బహిష్కరిస్తామంటూ చేసిన హెచ్చరిక ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎన్నికలను బహిష్కరించిన ఘటనలున్నాయి. కానీ, ఇప్పుడు ఓటును వేలం వేస్తూ సొమ్ము చేసుకోవడం, డీల్ కుదరకపోతే ఏకంగా పోలింగ్‌నే బహిష్కరించడం విస్మయం కలిగిస్తోంది. తాము ప్రజలకు ఎంతో చేశామని చెప్పుకుంటున్న పార్టీలు, తాము ప్రజలకు మరింత మంచి చేస్తాము అని భరోసా కల్పిస్తున్న పార్టీలు డబ్బుతో ఓటును కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయంటే వారికి వారి పని మీద, హామీల మీద నమ్మకం లేక చివరికి తాయిలాలనే నమ్ముకుంటున్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. విలువైన ఓటును అమ్ముకుంటే దాన్ని కొనుకున్న ప్రజాప్రతినిధిని తమ సమస్యలపై ప్రశ్నించే హక్కును కోల్పోతామనే అవగాహన ఓటరుకు లేకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం.
(Disclaimer : ఈ ఆర్టికల్ లోని అంశాలు పూర్తిగా పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ పొలిటికల్ అనలిస్ట్ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ వ్యక్తిగత అభిప్రాయాలు. ఈ అంశాలతో హెచ్.టి.తెలుగుకు ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ సంబంధంలేదు)