Pithapuram Trending : ట్రెండింగ్ లో ‘పిఠాపురం’ నియోజకవర్గం - ఎందుకంటే..?
Pithapuram Assembly constituency : ట్విట్టర్ ('X')లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ట్రెండింగ్ లో ఉంది. పవన్ కోసం మెగా హీరో రాంచరణ్ ప్రచారం చేయనున్నారు. దీంతో మెగా అభిమానులు భారీగా పోస్టులు చేస్తున్నారు.
Ramcharan Campagin in Pithapuram : పిఠాపురం…. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిని రేపుతున్న నియోజకవర్గం. ఇక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి వంగా గీతా బరిలో ఉండగా…. ఈసారి ఎవరు విజయం సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది.
2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాక, భీమవరం నుంచి బరిలో ఉన్నప్పటికీ.. ఓడిపోయారు. ఈ పరిణామం పవన్ కు రాజకీయంగా చాలా ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పవన్… కూటమిలో ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. వైసీపీ ఓటమే తన లక్ష్యమని పవన్ పదే పదే చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్కచోట పవన్ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.
పవన్ కోసం రంగంలోకి మెగా హీరోలు….
పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం మెగా హీరోలు రంగంలోకి దిగారు. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ స్వయంగా ప్రచారం నిర్వహించారు. సోదరుడు చిరంజీవి సామాజిక మాధ్యామం ద్వారా తమ్ముడు విజయం సాధించాలని కోరారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి పవన్ అని….. పిఠాపురం ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ఇక అల్లు అర్జున్ కూడా పవన్ కు మద్దతు ప్రకటించాడు.
సీన్ లోకి రామ్ చరణ్… ట్రెండింగ్ లో పిఠాపురం
ఇక ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగుయనుంది. అయితే మెగా హీరో రామ్ చరణ్ కూడా బాబాయ్ పవన్ కు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
పవన్ కల్యాణ్ కు మద్దతుగా రాంచరణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనే అవకాశం ఉంది. ముందుగా తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున మెగా హీరో పిఠాపురం వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
బాబాయ్ కోసం రామ్ చరణ్ రంగంలోకి దిగిన నేపథ్యంలో ట్విట్టర్ లో పిఠాపురం ట్రెండ్ అవుతుంది. #Pithapuram పేరుతో జనసేన పార్టీతో పాటు మెగా అభిమానులు తెగ పోస్టులు చేస్తున్నారు. బాబాయ్ కోసం అబ్బాయ్, జనసేనాని కోసం యువసేనాని అంటూ ఇందులో రాసుకొస్తున్నారు. మరోవైపు #HelloAP_ByeByeYCP ట్యాగ్ కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.
గత ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కల్యాణ్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత పూర్తిగా లెక్కలు మార్చిన పవన్… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. అంశాల వారీగా సమస్యలు తీసుకుంటూ ప్రభుత్వంపై పోరాడే పనిలో పడ్డారు. బీజేపీతో కలిసి ముందుకుసాగుతూ వచ్చారు. అయితే ఎన్నికలు దగ్గరపడే క్రమంలో ప్రతిపక్ష టీడీపీతో కలిశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరింత స్పీడ్ ను పెంచారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని… వైసీపీ వ్యతిరేక ఓటు చీలవద్దని అభిప్రాయపడ్డారు. అయితే గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్…ఈసారి పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. కూటమిలో భాగంగా పవన్ కు టీడీపీ, బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మే13వ తేదీన పోలింగ్ జరగనుంది.