Pawan Kalyan Campaign in Pithapuram : ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ దశా, దిశా మార్చేవి అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో తలపెట్టిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశం గర్వంగా చెప్పుకునేలా పిఠాపురం నుంచి మార్పు తీసుకొచ్చి చూపిస్తానని పవన్ హామీనిచ్చారు.
“దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక్క ఎంఎల్ఏ లేకుండా డబ్బు లేకుండా బలంగా మనలా పోరాడిన పార్టీ లేదు. మనం దెబ్బ తిన్నా సరే దశాబ్దకాలం పార్టీ నడిపాం. ఇది నా గొప్పతనం కాదు, నన్ను గుండెల్లో పెట్టుకున్న ఆడపడుచులు, జనసైనికులు పోరాట స్ఫూర్తి కారణం” అని పవన్ కల్యాణ్ అన్నారు.
బీజేపి జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా గర్వంగా ఒక్క ఎంఎల్ఏ కూడా లేని మన జనసేన పార్టీ కండువా మెడలో వేసుకున్నారని పవన్ గుర్తు చేశారు. 151 ఎంఎల్ఏ లు ఉన్న వైసిపి ను పక్కన పెట్టారని… అది జనసేన గొప్పతనమని చెప్పుకొచ్చారు.
ప్రజల హక్కుల కోసం పోరాటం జరుగుతుందని పవన్ అన్నారు. గ్రామం, సంగ్రమంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదన్న ఆయన… ఆ స్థితికి వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. కాకినాడ సెజ్ లో పిఠాపురం యువతకు ఉపాధి వచ్చేలా నేను చూస్తానని… అదే బాధ్యతను తానే తీసుకుంటానని చెప్పారు.
“జగన్ ఈరోజు భయపడుతున్నాడు, రోడ్డు మీదకు రావడానికి భయపడుతున్నాడు, మాట్లాడటానికి భయపడుతున్నాడు, ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు అని భయపడుతున్నాడు, ఆ భయం పరిచయం చేసింది జనసేన. మన హక్కులను అదిమేయాలని చూసాడు జగన్య అలాంటి వ్యక్తిని భయపెట్టింది ఒక వీరమహిళ. ఒక జనసైనికుడు, సుగాలి ప్రీతి తల్లి, భావన నిర్మాణ కార్మికులు నా దగ్గరకి సమస్యలు తీసుకొస్తే వారి తరపున నేను ప్రశ్నించి భయపెట్టాను. నేను మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను, ఒక తరం కోసం పోరాటం చేస్తున్నాను, 2 తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాను” అని పవన్ వ్యాఖ్యానించారు.
“ధర్మో రక్షతి రక్షితః, నేను 10 ఏళ్ల నుండి ధర్మం కోసం పోరాడుతున్నాను, నన్ను తిట్టారు, అవమానించారు, నా భార్యను, బిడ్డలను తిట్టినా భరించాము, కేవలం సామాన్యులు భయపడే పరిస్థితి ఉండకూడదనే భరించాను. ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని త్యాగం చేయాలి అనేది విదుర నీతి. ఈ రాష్ట్రం కోసం మా కుటుంబం నష్టపోయినా, త్యాగం చేయడానికి సిద్దపడదాం అని నా భార్యకు చెప్పి ముందుకు వచ్చాను. మొన్న సాయిధరమ్ తేజ్ పై కక్షతో వైసిపి గూండాలు గాజు సీసా తో దాడి చేయడానికి ప్రయత్నించారు. త్రుటిలో తప్పింది, తెలుగుదేశం కార్యకర్తలు తగిలి గాయం అయింది. ఇలా దాడులు చేసే పార్టీ వైసీపీ. రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మన పార్టీ పోటీ చేసే స్థానాలు తగ్గించుకుని త్యాగాలకు సిద్ధమయ్యాం. ఈ దేశం కోసం మేము ప్రాణాలు ఇస్తాం, మీ గాజు సీసా దాడులు మమ్మల్ని భయపెట్టలేదు, వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. తల తెగిపడినా సరే పోరాటం ఆపదు జనసేన” అని పవన్ హెచ్చరించారు.