Chiranjeevi: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. నేను పిఠాపురం వెళ్లడం లేదు: చిరంజీవి కామెంట్స్ వైరల్
Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకొని హైదరాబాద్ తిరిగి వచ్చిన చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని, ఇక తాను పిఠాపురం వెళ్లడం లేదని అతడు చెప్పాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో గురువారం (మే 9) పద్మ విభూషణ్ అందుకున్న తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాడు. శుక్రవారం (మే 10) సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో అతడు చేరుకోగానే.. పెద్ద ఎత్తు అభిమానులు స్వాగతం పలికారు. అక్కడే మీడియాతో మాట్లాడిన చిరు.. ఎన్టీఆర్ కు భారతరత్న, పవన్ కల్యాణ్ తరఫున పిఠాపురంలో ప్రచారంలాంటి అంశాలపై స్పందించాడు.
ఎన్టీఆర్‌కు భారతరత్నపై..
పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చిన చిరంజీవి.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ పై స్పందించాడు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాల్సిందే అని, తాను కూడా దానిని స్వాగతిస్తానని అన్నాడు. ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుంటే ఇది త్వరితగతిన అవుతుందని కూడా చిరు అభిప్రాయపడ్డాడు.
ఇక తమిళ నటుడు ఎంజీఆర్ కు భారతరత్న ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఇవ్వాలని, అదే అందరం కోరుకుంటామని చిరు స్పష్టం చేశాడు. ఇక తనకు భారతరత్న ఆశిస్తున్నారా అని ప్రశ్నిస్తే.. ఏ టైమ్ కు ఏది రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశపడితే వచ్చేది కాదని చిరంజీవి అనడం గమనార్హం.
పిఠాపురం వెళ్లడం లేదు: చిరు
ఇక తాను పిఠాపురం వెళ్లి పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయబోతున్నానన్న వార్తలను చిరంజీవి ఖండించాడు. తాను పిఠాపురం వెళ్లడం లేదని స్పష్టం చేశాడు. అది మీడియా సృష్టి అని, దానిని తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. రాజకీయంగా తన తమ్ముడు ఇంకా ఎదగాలని తాను, తన కుటుంబం మొత్తం కోరుకుంటుందని కూడా ఈ సందర్భంగా చిరంజీవి తెలిపాడు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అక్కడికి నేరుగా వెళ్లి ప్రచారం చేస్తుండగా.. అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభతోపాటు తెలంగాణలోనూ లోక్‌సభ ఎన్నికలు సోమవారం (మే 13) జరగనున్న విషయం తెలిసిందే.
వాళ్లందరి వల్లే నాకీ గౌరవం: చిరంజీవి
భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ అందుకోవడం నాలుగు దశాబ్దాల తన కళా సేవకు గుర్తింపు అని ఈ సందర్భంగా చిరంజీవి అన్నాడు. అయితే తనకు ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్లు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లతోపాటు తనను ఆదరించిన అభిమానులు, ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమైందని, వాళ్లందరికీ ధన్యవాదాలు అని చిరు చెప్పాడు.
చిరంజీవితోపాటు వైజయంతిమాలకు కూడా పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్లు గురువారం (మే 9) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన డిన్నర్ లోనూ చిరంజీవి పాల్గొన్నాడు. దీనికి చిరుతోపాటు అతని భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కూడా హాజరయ్యారు.