AP Elections Betting : ఏపీ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్ లు, తగ్గేదే లే అంటోన్న పందెంరాయుళ్లు!-ap elections betting on key candidates constituencies like pithapuram mangalagiri kuppam pulivendula ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Elections Betting : ఏపీ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్ లు, తగ్గేదే లే అంటోన్న పందెంరాయుళ్లు!

AP Elections Betting : ఏపీ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్ లు, తగ్గేదే లే అంటోన్న పందెంరాయుళ్లు!

Bandaru Satyaprasad HT Telugu
May 12, 2024 05:32 PM IST

AP Elections Betting : ఏపీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లలో ఉత్కంఠ నెలకొంది. అధికారం కైవసంతో పార్టీ అభ్యర్థుల మెజార్టీలపై కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లలో బెట్టింగ్ లు కాస్తున్నారు.

ఏపీ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్ లు
ఏపీ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్ లు

AP Elections Betting : ఏపీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు పోల్ మేనేజ్మెంట్ లో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో విజయావకాశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు షురూ చేశారు. ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది, గెలుపోటములపై కాయ్ రాజా కాయ్ అంటున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకూ మెజార్టీలపై కోట్లల బెట్టింగ్ కడుతున్నారు. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి స్థానాలపై భారీగా బెట్టింగ్ పెడుతున్నారు.

కూటమి వర్సెస్ జగన్

బెట్టింగ్ రాయుళ్లు అధిక శాతం కూటమి వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయాలపై భారీగా పందేలు కాస్తున్నారు. కూటమికి 100-110 సీట్లు వస్తాయంటూ 1:2 చొప్పున పందేలు కాస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాడుతుందని 1:5 చొప్పున అంటే రూ.లక్షకు రూ.5 లక్షలు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ మెజార్టీ, పులివెందులలో జగన్‌, కుప్పంలో చంద్రబాబు మెజారిటీపై 1: 2, నియోజకవర్గాల్లో 1:1 చొప్పున రూ.కోట్లలో పందేలు సాగుతున్నాయి. ఇక భీమవరంలో జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.

పిఠాపురంపై భారీగా బెట్టింగ్ లు

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ కు 50 వేలకు పైగా మెజారిటీ వస్తుందని కాకినాడకు చెందిన ఓ వ్యాపారి రూ.2.5 కోట్లు బెట్టింగ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తున్న ఉండి నియోజకవర్గంలో 1:2 లెక్కన పందేలు కాస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని, పులివెందులలో జగన్ మెజార్టీ పెరుగుతోందని బెట్టింగ్‌ వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంపై భారీగా బెట్టింగ్ సాగుతోంది. గత ఎన్నికల ఓటమి నేపథ్యంలో ఈసారి పిఠాపురంలో విజయం సాధించాలని పవన్ కల్యాణ్ కసిగా ఉన్నారు. కాపు ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో పవన్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. నెల్లూరు రూరల్‌, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్‌, రాజానగరం, రాజమండ్రి, విశాఖ తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాలపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. లక్షల నుంచి కోట్లలో బెట్టింగులు కాస్తున్నారు పందెం రాయుళ్లు.

వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో దిగిన వైసీపీ జోరుగా ప్రచారం చేసింది. అయితే ఈసారి పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గుతుందనే అంశం బెట్టింగ్ జోరుగా సాగుతోందని సమాచారం. మంత్రులుగా చేసినవాళ్ల సీట్లు గల్లంతు అవుతాయని, వైసీపీ 30 లోపు సీట్లు వస్తాయని, బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. అక్కాతమ్ముళ్ల మధ్య పోరుపై ఆసక్తి నెలకొంది. దీంతో కడప ఎంపీ సీటుపై కూడా పందెంరాయుళ్లు కన్నేశారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు. మంగళగిరిలో లోకేష్ గెలుపుపై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారని సమాచారం.

(బెట్టింగ్ చట్టరీత్యా నేరం. బెట్టింగ్ కాసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ఆర్టికల్ మీ అవగాహన కోసం మాత్రమే)

సంబంధిత కథనం