TDP JSP Alliance 2024 : కాకరేపిన ‘పవన్’ ప్రకటన - పిఠాపురంలో ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు
TDP Pithapuram : పిఠాపురం తెలుగుదేశంలో అసమ్మతి భగ్గుమంది. పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్ల జనసేన అధినేత పవన్(Pawan Kalyan) ప్రకటించటంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహానికి లోనయ్యారు.
TDP Pithapuram : వచ్చే ఎన్నికల్లో పిఠాపురం(Pithapuram Assembly constituency) నుంచి పోటీ చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన ప్రకటన కాకరేపింది. పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి తమ నేత(మాజీ ఎమ్మెల్యే వర్మ) కాకుండా పవన్ పోటీ చేయటంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వర్మకే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. వర్మకు కాకుండా పవన్ కల్యాణ్ పోటీ చేస్తే… మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్…. ఈసారి కూడా అక్కడ్నుంచే చేయాలంటూ హితవు పలికారు.
ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన... ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీతా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేవలం 1,036 ఓట్ల తేడాతో వర్మ ఓటమిపాలయ్యారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం వర్మ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దొరబాబుపై 47,080 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీ టికెట్ ను దక్కించుకున్నారు వర్మ. అయితే ఈసారి ఆయన ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్ దక్కించుకొని విక్టరీ కొట్టాలని భావిస్తున్నారు వర్మ. అయితే పొత్తులో భాగంగా.... ఈ సీటు టీడీపీకి దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వర్మ మద్దతుదారులు.... అధినాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ ప్రకటన - ఏం చెప్పారంటే…?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Elections 2024) తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. గురువారం జనసేన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్…. ఈ ప్రకటన చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు పవన్ కల్యాణ్. ఈ రెండు చోట్ల కూడా ఓడిపోయారు. అయితే ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా… పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
2014లో కూడా పిఠాపురం(Pitapuram) నుంచి పోటీ చేయాలనే దానిపై విజ్ఞప్తులు వచ్చాయని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. కానీ అనంతపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నానని అన్నారు పవన్(Pawan Kalyan). పార్టీ ఆఫీస్ ను కూడా అనంతపురం నుంచే ప్రారంభించానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. శక్తి పీఠానికి కేంద్రమైన పిఠాపురం నుంచి బరిలో ఉంటానని అన్నారు. ఎంపీగా పోటీ చేయాలా..? వద్దా…? అనే విషయంపై ఆలోచిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఎంపీగా పోటీ చేయటం పెద్దగా ఇష్టంలేదని... ఎమ్మెల్యేగానే ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తానని వివరించారు.
మొత్తంగా పిఠాపురం నుంచే పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్ ప్రకటన చేసిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి…!
సంబంధిత కథనం