RGV in AP Elections : ఏపీ ఎన్నికల బరిలో ఆర్జీవీ - పవన్ బరిలో ఉండే స్థానం నుంచే పోటీ..!
Movie Director RGV Contest in AP: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సంచలన ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
Director RGV Contest in AP Elections 2024: రామ్ గోపాల్ వర్మ… డైరెక్టర్ గా పేరొందినప్పటికీ తనదైన శైలిలో ప్రకటనలు, కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలకు సంబంధించిన పోస్టులు చేస్తూ చర్చకు తెరలేపుతున్నారు. కట్ చేస్తే…. తాజాగా ఆసక్తికరమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది సడెన్ గా తీసుకున్న నిర్ణయమంటూ తన "ఎక్స్" (ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(AP Elections 2024) పోటీపై ఇవాళే జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన క్షణాల వ్యవధిలోనే రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కూడా ట్వీట్ చేశారు. “ఆకస్మిక నిర్ణయం..నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
మరోవైపు ఈ ట్వీట్ కు సంబంధించి నెటిజన్లు నుంచి భారీగా స్పందన వస్తోంది. ఇది నిజమేనా వర్మ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమేనా…? లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటీపై పోస్టు చేసిన కాసేపటికే మరో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. సందేహించేవారందరికీ చెబుతున్నాను… 'ఐయామ్ సూపర్ సీరియస్' అంటూ పోస్టును వదిలారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు పవన్ కల్యాణ్. ఈ రెండు చోట్ల కూడా ఓడిపోయారు. అయితే ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా… పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఇవాళే ప్రకటించారు. మరోవైపు పవన్ పోటీ చేసే స్థానంపై గురి పెట్టింది వైసీపీ. బలమైన అభ్యర్థిని బరిలో దించేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. పిఠాపురం నుంచి వంగా గీతాను బరిలో దించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమెను సమన్వయకర్తగా ప్రకటించింది. ఇదిలా ఉండగానే…. ఆర్జీవీ తాను కూడా పోటీ చేస్తున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది. అయితే ఆర్జీవీ నిజంగానే పోటీ చేస్తారా..? చేస్తే ఏ గుర్తుపై పోటీ చేస్తారు..? ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారా..? అన్నది తేలాల్సి ఉంది. ఇవన్నీ కాకుండా… పోటీలోనే ఉండను అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.