Chandrababu On BJP Alliance : ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన(BJP Janasena TDP Alliance) పొత్తు ఖరారైంది. పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. శనివారం దిల్లీ నుంచి టీడీపీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు...బీజేపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ఆర్థికంగా కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. అందుకే రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. బీజేపీ, జనసేనతో సీట్ల సర్దుబాటుపై(BJP JSP Seats Sharing) స్పష్టత వచ్చిందన్నారు. మరో సమావేశం తర్వాత పోటీ చేసే స్థానాలపై నిర్ణయిస్తామన్నారు. సీట్ల సర్దుబాటుపై మా మధ్య ఎలాంటి గందరగోళం లేదన్నారు. అయితే సీట్ల సర్దుబాటు కారణంగా ఎవరికైనా సీటు రాకపోతే నిరుత్సాహపడొద్దనన్నారు.
పొత్తు ప్రకటనతో ఈ 17న చిలకలూరిపేటలో(Chilakaluripeta Meeting) బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించనున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ సభలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొంటారని చెప్పారు. అయితే ప్రధాని మోదీ షెడ్యూల్‌లో మార్పులు ఉంటే 18న సభ నిర్వహించనున్నామన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్ సభ స్థానాలు ఇస్తున్నామన్నారు. ఎక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందనేది రెండ్రోజుల్లో ప్రకటిస్తామని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఏపీలో ఇప్పటికే 99 స్థానాల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 24 స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. బీజేపీతో పొత్తు ప్రకటనతో సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ నెలకొంది. ఏ సీటు ఎవరికి కేటాయిస్తారో అని మూడు పార్టీలో నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం లోక్ సభ స్థానాలపై దృష్టి పెట్టింది. ఆ దిశగానే సీట్ల సర్దుబాటు ఉంటుందని తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం... 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన 24, బీజేపీ 6, టీడీపీ 145 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. 25 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 6, జనసేన 2, టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
ఎన్డీఏలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) శనివారం మరోసారి భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు 50 నిమిషాలపాటు ముగ్గురు నేతలు చర్చించారు. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ సమావేశ వివరాలను దిల్లీలో టీడీపీ నేత కనకమేడల మీడియాకు వివరించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన (TDP BJP Janasena Alliance)కలిసి పనిచేయాలని నిర్ణయించాయని కనకమేడల తెలిపారు.
సంబంధిత కథనం