Janasena Candidates: 9 స్థానాల్లో జనసేన అభ్యర్థుల ఎంపిక ఖరారు.. దిశానిర్దేశం చేసిన పవన్ కల్యాణ్
Janasena Candidates: ఏపీలో విపక్షాల సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టి పెట్టాయి. జనసేన పోటీ చేసే స్థానాల్లో మరో ఆరు స్థానాలపై పవన్ క్లారిటీ ఇచ్చారు.
Janasena Candidates: టీడీపీ-జనసేన-బీజేపీ BJPమధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తోంది. ఇప్పటికే ఆరు నియోజక వర్గాల్లో పోటీచేసే అభ్యర్థులను Candidates పవన్ కళ్యాణ్ Pawan Kalyan ప్రకటించారు.
తాజాగా పత్సమట్ల ధర్మరాజు, పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, పులివర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బత్తుల బలరామకృష్ణ, కందుల దుర్గేష్‌లకు ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
జనసేన తరపున విశాఖ జిల్లా పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్‌కుమర్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్‌లను ప్రచారం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ తాజాగా సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణానైనా వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో దూకుడు పెంచారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం అభ్యర్ధిగా బోలిశెట్టి శ్రీనివాస్, ఉంగటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు ఎన్నికల అభ్యర్ధిత్వాలకు పవన్ అమోదం తెలిపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలులో దేవ వరప్రసాద్, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. ఆరణి శ్రీనివాసులు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.
నిడదవోలు నుంచి కందులు దుర్గేష్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులతో పవన్ కళ్యాణ విడివిడిగా భేటీ అయ్యారు.
ఎన్నికల నేపథ్యంలో నియోజక వర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పవన్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన పొత్తులు, సమన్వయంపై అభ్యర్థులతో చర్చించారు. ఖచ్చితంగా గెలిచి తీరాలని దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థులను బలాన్ని ఏ మాత్రం తక్కువ అంచనా వేయొద్దని, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల్లో పొత్తులు కుదర్చుకున్నట్టు అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ వివరించారు.
ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే ఆరు నియోజక వర్గాల్లో అభ్యర్థుల్ని ఆ పార్టీ ప్రకటించింది. బుధవారం మరో 9మందికి సమాచారం అందించారు. వీటితో పాటు కాకినాడ జిల్లా పిఠాపురం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, రామచంద్రపురం, పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ, కృష్ణా జిల్లా అవనిగడ్డ, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, ఏలూరు జిల్లా పోలవరం నియోజక వర్గల్లో జనసేన పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు తిరుపతి జిల్లాకు చెందిన గంటా నరహరి బుధవారం పార్టీలో చేరారు. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని నరహరి ఆశిస్తున్నారు. నరహరి అభ్యర్ధిత్వానికి ఆరణి శ్రీనివాసులు కూడా సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాంబాబు, తిరుపతి శ్రీనివాసరావు, మాదివాడ వెంకట కృష్ణాంజనేయులు పోటీకి ప్రయత్నిస్తున్నారు.
లోక్‌సభ స్థానాల్లో జనసేన-టీడీపీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. తొలుత జనసేనకు మూడు స్థానాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా కాకినాడ-మచిలీపట్నం స్థానాలపై మాత్రమే స్ఫష్టత వచ్చింది. తిరుపతి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తిరుపతిలో బీజేపీ కూడా పోటీకి ఆసక్తి వ్యక్తం చేస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె నీహారిక బీజేపీ తరపున టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
విజయనగరం జిల్లా పాలకొండ నుంచి నిమ్మల నిబ్రం, టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తేజోవతి, ఎస్‌బిఐ రిటైర్డ్ మేనేజర్ కోరంగి నాగేశ్వరరావు కూడా టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
కచ్చితంగా గెలిచి తీరాలి
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు సూచించారు. కక్ష సాధింపు... అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నామని హెచ్చరించారు.
ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా మరుక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సేచించారు. 2024 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ గతిని మారుస్తాయి... ఈ ఎన్నికల్లో మన కూటమి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునీ నమ్ముకున్న పార్టీతో అని మరచిపోవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు, కొందరు ముఖ్య నాయకులతో బుధవారం పవన్ కళ్యాణ్ ముఖాముఖీ చర్చించారు. ఎన్నికల నియమావళి, నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకూ ఉండే వివిధ దశలు, నియమ నిబంధనలు, పొందాల్సిన అనుమతులను తెలియచేసే పత్రాలను అందచేశారు.
ఎన్నికల ప్రక్రియలో వ్యూహాత్మకంగా ముందుకువెళ్లాలని... టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని పవన్ సూచించారు. ప్రతి దశలోనూ అభ్యర్థులు, నాయకులు, శ్రేణులు అప్రమత్తంగా అడుగులు వేయాలని సూచించారు. ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
సంబంధిత కథనం