PawanKalyan Shifting: పవన్ కళ్యాణ్‌ మకాం శాశ్వతంగా మంగళగిరికి మార్చేసినట్టేనా!-janasena president pawan kalyan has shifted permanently from hyderabad to mangalagiri ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawankalyan Shifting: పవన్ కళ్యాణ్‌ మకాం శాశ్వతంగా మంగళగిరికి మార్చేసినట్టేనా!

PawanKalyan Shifting: పవన్ కళ్యాణ్‌ మకాం శాశ్వతంగా మంగళగిరికి మార్చేసినట్టేనా!

HT Telugu Desk HT Telugu
Aug 02, 2023 08:55 AM IST

PawanKalyan Shifting: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ మకాం మంగళగిరికి మార్చేశారు. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని సైతం మంగళగిరికి మార్చారు.ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులు విమర్శించే అవకాశం ఇవ్వకూడదనే పవన్ మకాం మార్చినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ‌, నాదెండ్ల మనోహన్
పవన్ కళ్యాణ‌, నాదెండ్ల మనోహన్

PawanKalyan Shifting: ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చారు. అక్కడ పనిచేసే సిబ్బంది, ఇతర విభాగాలు, దస్త్రాలు, కంప్యూటర్లను కూడా మంగళగిరికి తరలించారు. పవన్‌కల్యాణ్‌ ఇకపై మంగళగిరిలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. షూటింగ్‌లు ఉంటేనే పవన్‌ హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సినిమాలపై చర్చలకు దర్శకులు మంగళగిరికే రానున్నారు. కేంద్ర కార్యాలయంలో పవన్‌ అవసరాల అనుగుణంగా ఇంటిని కూడా నిర్మించారు.

తెనాలిలో జనసేన జెండా ఎగురుతుంది….

తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని, అక్కడ సీటూ, గెలుపూ మనదే అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌ను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధినీ తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు.

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆత్మీయంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులను మనోహర్ పరిచయం చేశారు.

జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా పాలక పక్షం ఆలోచిస్తుందన్నారు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోవని, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు... నేను బాగుండాలి.. నేనే బాగుపడిపోవాలి అనేది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అని ఎద్దేవా చేశారు. దాన్ని ఎప్పుడో గ్రహించడంతోనే మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రజలు మాత్రం ఎంతో సానుభూతితో తండ్రి లేని పిల్లాడు.. సంవత్సరం నుంచి నడుస్తున్నాడని జాలితో ఓట్లు వేశారని, ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడుతున్నాన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు స్థిరత్వం ఇవ్వాలని బలమైన కాంక్షతోనే జనసేన పార్టీ పనిచేస్తుందని పవన్ చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి అనేదే ప్రాథమిక ఎజెండాగా ఎదగాలన్నది నాయకులు పట్టించుకోలేదని, కేవలం వారి వ్యక్తిగత ఎదుగుదల తప్ప, ప్రజా క్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.

జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద నిబద్ధతతో నిలబడి ఉందని, ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినా, ఇక్కడ మాట్లాడినా విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి వైపు వెళ్లాలని అంశాలు, కేంద్రం అందించాల్సిన సాయం మీద మాట్లాడుతానని చెప్పారు. మేం చెప్పే ప్రతి మాట రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని చెబుతున్నదే అని పవన్ వివరించారు.

Whats_app_banner