TDP BJP Janasena Meeting : చంద్రబాబు ఇంట్లో కీలక భేటీ, సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు!
TDP BJP Janasena Meeting : ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన(TDP BJP Janasena) పొత్తు కుదిరింది. దీంతో ఈ మూడు పార్టీలు సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్యనేతలు భేటీ అవుతున్నారు
TDP BJP Janasena Meeting : మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ (AP Assembly Elections) వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. ఇటీవల దిల్లీలో పొత్తులు కుదుర్చుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి(TDP BJP JSP Alliance) సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తుంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఇంట్లో బీజేపీ, జనసేన కీలక నేతల భేటీ జరుగుతోంది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుజు జయంత్ పండా చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.
చంద్రబాబు ఇంట్లో కీలక భేటీ
వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు(Seats Sharing)పై టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు చంద్రబాబు ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పండాతో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ చర్చల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మరికాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari) కూడా చంద్రబాబు నివాసానికి రానున్నట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా.... జనసేన, బీజేపీ 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్‌సభ స్థానాలు పోటీ చేయనుంది. ఇప్పటికే ఆరు అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను(Janasena Candidates) ఖరారు చేసింది. మరోవైపు బీజేపీకి కేటాయించిన స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మూడు పార్టీల అభ్యర్థుల ఖరారుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఎవరికెన్ని సీట్లు, ఇవాళ క్లారిటీ
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేరుకున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇవాళ్టి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత రెండు రోజులుగా బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ తో పాటు రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. నేటి భేటీతో ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే జనసేన 5 అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా సోమవారం మరో అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేశ్ ను నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీతో సీట్ల సర్దుబాటుతో స్పష్టత వచ్చాక... మిగిలిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం