Pawan Kalyan Constituency: పిఠాపురం నుంచి పోటీ చేస్తాను - పవన్ కల్యాణ్ ప్రకటన
Pawan Kalyan Constituency: అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు.
2014లో కూడా పిఠాపురం(Pitapuram) నుంచి పోటీ చేయాలనే దానిపై విజ్ఞప్తులు వచ్చాయని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. కానీ అనంతపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నానని అన్నారు పవన్(Pawan Kalyan). పార్టీ ఆఫీస్ ను కూడా అనంతపురం నుంచే ప్రారంభించానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. శక్తి పీఠానికి కేంద్రమైన పిఠాపురం నుంచి బరిలో ఉంటానని అన్నారు. ఎంపీగా పోటీ చేయాలా..? వద్దా…? అనే విషయంపై ఆలోచిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఎంపీగా పోటీ చేయటం పెద్దగా ఇష్టంలేదని... ఎమ్మెల్యేగానే ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తానని వివరించారు.
గత ఎన్నికల్లో భీమవరం నుంచి….
గత ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కల్యాణ్(Pawan Kalyan)కుఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోగా.. గాజువాకలో మూడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో పవన్ రాజకీయ భవిష్యత్ ఏంటన్న చర్చ కూడా జోరుగా జరిగింది. ఆ తర్వాత పూర్తిగా లెక్కలు మార్చిన పవన్… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. అంశాల వారీగా సమస్యలు తీసుకుంటూ ప్రభుత్వంపై పోరాడే పనిలో పడ్డారు. బీజేపీతో కలిసి ముందుకుసాగుతూ వచ్చారు. అయితే ఎన్నికలు దగ్గరపడే క్రమంలో ప్రతిపక్ష టీడీపీతో కలిశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరింత స్పీడ్ ను పెంచారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని… వైసీపీ వ్యతిరేక ఓటు చీలవద్దని అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ పెద్దలతో కూడా టచ్ లోకి వెళ్లారు. ఇటీవలనే మూడు పార్టీల మధ్య కూడా పొత్తు కుదిరింది. పోటీ చేసే స్థానాల సంఖ్యపై కూడా క్లారిటీ ఇచ్చింది.
ఏపీ వ్యాప్తంగా కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం కూడా పిఠాపురమే. 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ గెలిచింది. గత ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థి ఇక్కడ పోటీ చేయగా… 28 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన దొరబాబు విజయం సాధించారు. టీడీపీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అన్నింటిని లెక్కలు వేసుకుంటున్న జనసేన నాయకత్వం… ఈసారి పిఠాపురంపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వారాహి యాత్ర విషయంలో కూడా పిఠాపురానికి ఎక్కవ సమయం కేటాయించారు. అయితే కేవలం పొత్తే కాకుండా.. సామాజికవర్గం ఓట్లు కూడా ఇక్కడ పవన్ కు కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.