AP Elections 2024 : 'పవన్' పోటీ ఎక్కడ్నుంచి...? తెరపైకి పిఠాపురం, లెక్క ఇదేనా..!-pawan kalyan is likely to contest from pithapuram seat in the next ap assembly elections 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Elections 2024 : 'పవన్' పోటీ ఎక్కడ్నుంచి...? తెరపైకి పిఠాపురం, లెక్క ఇదేనా..!

AP Elections 2024 : 'పవన్' పోటీ ఎక్కడ్నుంచి...? తెరపైకి పిఠాపురం, లెక్క ఇదేనా..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 11:29 AM IST

Andhra Pradesh Elections 2024: ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మరోసారి విక్టరీనేై లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంటే.. టీడీపీ - జనసేన పక్షం బ్రేకులు వేయాలని చూస్తోంది. అయితే పవన్ ఈసారి పోటీ చేసే నియోజకవర్గంపై అందరి చూపు పడింది. ఇందుకు సంబంధించి ఓ నియోజకవర్గం పేరు గట్టిగా తెరపైకి వస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్

Andhra Pradesh Elections 2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. 'వై నాట్ 175' అంటూ అధికార వైసీపీ మరోసారి విజయం సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం భారీగానే కసరత్తు చేస్తోంది. మరోవైపు ఫ్యాన్ పార్టీకి బ్రేకులు వేయాలని టీడీపీ- జనసేన గట్టిగా భావిస్తోంది. ఇప్పటికే కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన ఇరు పార్టీల నాయకత్వాలు… సీట్ల పంపకాలపై దృష్టిపెట్టాయి. ఇదే విషయంపై ఇరు పార్టీల అధినేతలు కూడా చర్చించారు. అయితే ఈ విషయంలో పలు లెక్కలు తెరపైకి వస్తున్నప్పటికీ… అధికారికంగా ప్రకటన వచ్చే అంత వరకు చెప్పే పరిస్థితి లేదు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్… ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనేది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఈసారి పోటీ ఎక్కడ్నుంచి…?

గత ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పవన్‌ కల్యాణ్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. భీమవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఓడిపోగా.. గాజువాకలో మూడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో పవన్ రాజకీయ భవిష్యత్ ఏంటన్న చర్చ కూడా జోరుగా జరిగింది. ఆ తర్వాత పూర్తిగా లెక్కలు మార్చిన పవన్… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. అంశాల వారీగా సమస్యలు తీసుకుంటూ ప్రభుత్వంపై పోరాడే పనిలో పడ్డారు. బీజేపీతో కలిసి ముందుకుసాగుతూ వచ్చారు. అయితే ఎన్నికలు దగ్గరపడే క్రమంలో ప్రతిపక్ష టీడీపీతో కలిశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరింత స్పీడ్ ను పెంచారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని… వైసీపీ వ్యతిరేక ఓటు చీలవద్దని అభిప్రాయపడ్డారు. అయితే గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్…ఈసారి ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగా ఈసారి 2 చోట్ల కాకుండా.. ఒకే చోట చేస్తారని తెలుస్తోంది.

పిఠాపురం నుంచేనా..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్… పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ వర్గాలు, అభిమానులు చెబుతున్నారు. ఆ దిశగా గ్రౌండ్ వర్క్ కూడా నడుస్తున్నట్లు సమాచారం. ఏపీ వ్యాప్తంగా కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం కూడా పిఠాపురమే. 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ గెలిచింది. గత ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థి ఇక్కడ పోటీ చేయగా… 28 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన దొరబాబు విజయం సాధించారు. టీడీపీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. పలు సర్వేల్లో కూడా ఇక్కడ పవన్ విక్టరీ చాలా సులభమని తేల్చాయంట. దీంతో అన్నింటిని లెక్కలు వేసుకుంటున్న జనసేన నాయకత్వం… ఈసారి పిఠాపురంపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వారాహి యాత్ర విషయంలో కూడా పిఠాపురానికి ఎక్కవ సమయం కేటాయించారు. అయితే కేవలం పొత్తే కాకుండా.. సామాజికవర్గం ఓట్లు కూడా ఇక్కడ పవన్ కు కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు పిఠాపురంపై ఫోకస్ పెట్టింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబును తప్పించాలని భావిస్తోందంట…! అదే జరిగితే ఆయనకు వేరే చోటు నుంచి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ్నుంచి వంగా గీతాను బరిలో దించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 11 మంది ఇంఛార్జులను మార్చిన వైసీపీ… రేపోమాపో మరికొందరిని కూడా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ సీటు విషయంలో క్లారిటీ రానుంది. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున దొరబాబు(పిఠాపురం ఎమ్మెల్యే) అల్లుడు రామయ్య పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కర్నాటకలోని ఓ డీమ్డ్ వర్శిటీ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. నిజంగానే ఆయనకు సీటు ఖరారైతే… దొరబాబు కూడా జనసేనలోకి వెళ్తారా..? లేక వైసీపీలోనే కొనసాగుతారా అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం