JanasenaTdp Public Meeting: నేడు తాడేపల్లిగూడెంలో TDP జనసేన బహిరంగ సభ.. పిఠాపురం నుంచి పవన్ పోటీ?
JanasenaTdp Public Meeting: టీడీపీ జనసేన కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన తర్వాత తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహణకు తాడేపల్లిగూడెం Tadepalligudem వేదిక అయ్యింది. లక్షలాది మంది కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
JanasenaTdp Public Meeting: జనసేన - తెలుగుదేశం పార్టీలు ఎన్నికలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న బహిరంగ సభకు తాడేపల్లి గూడెం వేదిక అయ్యింది. ఉమ్మడి సభ తెలుగు జన విజయకేతనం "జెండా" సభ పేరుతో నిర్వహిస్తున్నారు.
తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 6 లక్షల మంది సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సభ నిర్వహణకు జనసేన పార్టీ పూర్తి బాధ్యతను తీసుకొని సభను నిర్వహిస్తోంది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ఉమ్మడిగా సమాయత్తం చేసే సభగా ఇది నిలిచిపోనుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సభకు హాజరు కానున్న నేపథ్యంలో ఇరు పార్టీల నుంచి కార్యకర్తలు, మహిళలు కూడా పెద్ద ఎత్తున సభకు తరలి రానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తికాగా తాగునీరు, మరుగుదొడ్లు, రవాణా ఏర్పాట్లకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా చూస్తున్నారు.
సభ నిర్వహణ కోసం ఇరుపార్టీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇప్పటికే కమిటీలను నియమించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ మొదలు కానుంది. సభా వేదికపై ఇరు పార్టీల నుంచి 500 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండడంతో దానికి తగిన ఏర్పాట్లు చేశారు.
ఇరు పార్టీలకు సంబంధించిన నియోజక వర్గ స్థాయి నాయకులు రవాణా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బస్సులు, కార్లు జీపులు ఇతర రవాణా మార్గాల ద్వారా తాడేపల్లిగూడెం చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సభా ప్రాంగణంలోని వారందరికీ వేదిక స్పష్టంగా కనిపించేలా మాట్లాడే వ్యక్తులు కూడా సులభంగా గుర్తించేలా సభా వేదికను ఏ మూల నుంచైనా చక్కగా చూసేలా ఏర్పాట్లు చేశారు. సభ పూర్తయ్యే సమయానికి రాత్రి వేళ అయ్యే అవకాశం ఉండడంతో ప్రాంగణం అంతా విద్యుత్ దీప కాంతులతో నింపారు. ప్రత్యేకమైన జోన్లుగా విభజించి ఇప్పటికే పాసులు పంపిణీ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీల్లో ఉండేవారికి కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా సభ మొత్తం వీక్షించే ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఇరు పార్టీల అధినేతలు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సభకు రానున్నారు. దీంతో ఇప్పటికే హెలిపాడ్ల నిర్మాణం కూడా పూర్తయి అన్ని అనుమతులు తీసుకున్నారు. సభ ప్రాంగణం సమీపంలోనే ఒక హెలిపాడ్ ఏర్పాటు చేశారు. సభ నిర్వహణకు ప్రత్యేక వాలంటరీ కమిటీలను ఏర్పాటు చేశారు.
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ….
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజక వర్గంపై స్పష్టత వచ్చింది. 2019లో భీమవరంలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈసారి కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. పొత్తులో భాగంగా ఇరు పార్టీల అధినేతలు అభ్యర్థుల జాబితా ప్రకటించే సమయంలో జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీచేస్తారని ప్రకటించకపోవడంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి.
విస్తృత కసరత్తు తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేయడానికి పవన్ మొగ్గు చూపినట్లు తెలిసింది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 91 వేలు ఉండటంతో ఇక్కడి నుంచి పోటీచేస్తే పవన్ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. దీంతో పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్, ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చనేది జనసేన అంచనా వేస్తోంది. పిఠాపురంలో టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. పిఠాపురం సీటు విషయంలో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య వివాదాలు కూడా నెలకొన్నాయి. తాజాగా పవన్ పోటీ చేయనున్న నేపథ్యంలో వర్మను బుజ్జగించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.