AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు-start of release of funds for welfare schemes cash in beneficiary accounts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dbt Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

Sarath chandra.B HT Telugu
May 16, 2024 10:06 AM IST

AP DBT Transfer: ఏపీలో సంక్షేమ పథకాలకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు మొదలయ్యాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయిన నగదు బదిలీని ఆర్థిక శాఖ గురువారం నుంచి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు నిధులు విడుదల చేస్తున్నారు.

ఏపీ సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
ఏపీ సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం

AP DBT Transfer: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు అందిస్తున్న నగదు బదిలీ ప్రారంభమైంది. గత జనవరి నుంచి మార్చి వరకు ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేసిన పథకాలకు సంబంధించిన నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమ కాలేదు. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలింగ్‌ ముందు నగదు బదిలీ నిలిచిపోయింది.

ఈసీ ఆంక్షలు పోలింగ్ ముగియడంతో తొలగిపోవడంతో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభించారు. బుధవారం ఆసరా పథకానికి రూ.1480 విడుదల చేశారు. జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌‌ కోసం రూ.502 కోట్లు విడుదల అయ్యాయి.

మిగిలిన పథకలకు నేడు రేపు నిధులు విడుదల చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దశల వారీగా నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తి చేయనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభమైంది.

ఏమి జరిగిందంటే…

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల ముందు సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత జనవరి నుంచి మార్చి వరకు వివిధ పథకాలకు నిధుల విడుదల చేసేందుకు సిఎం జగన్ బటన్ నొక్కారు. అయితే ఆ పథకాలకు నిధులు మాత్రం జమ కాలేదు.

సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధుల విడుదల చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేస్తూ ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో నష్టపోతున్నామని, పాత పథకాలకే నిధులు విడుదల కాలేదని పలువురు లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మే 10వ తేదీన ఒక్క రోజు మాత్రమే నిధులు విడుదల చేయాలని 9వ తేదీ రాత్రి హైకోర్టు తీర్పునిచ్చింది. 10వ తేదీన డివిజన్‌ బెంచ్‌లో సింగల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలో నిధులు విడుదల చేయడంపై ఈసీ అభ్యంతరం చెప్పింది. పోలింగ్ ముందు నిధుల పంపిణీ సరికాదని, ఓటర్లను ప్రభావితం చేయడమేనని అభ్యంతరం తెలిపింది. 10వ తేదీ వాదనలు ముగిసే సమయానికి నగదు బదిలీ కాలేదు. దీంతో పోలింగ్ ముగిసే వరకు డబ్బులు పంపిణీ చేయొద్దని హైకోర్టు సీజే ఆదేశించారు. సింగల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వచ్చే జూన్‌లో ఈ వ్యవహారంపై విచారణ జరపుతామని కేసు విచారణ వాయిదా వేశారు.

హైకోర్టు విచారణ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మే 10న మరింత స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. సింగల్ జడ్జి తీర్పు గడువు ముగిసిపోవడంతో పాటు నగదు బదిలీపై స్పష్టమైన ఆదేశాలు లేవని పోలింగ్ ముగిసే వరకు నగదు విడుదల చేయొద్దని ఆదేశించింది. దీంతో ఆర్దిక శాఖ నగదు బదిలీకి సిద్ధమైనా చివరి నిమిషంలో నిలిపివేసింది.

గత జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ఆరు పథకాలకు దాదాపు రూ.14వేల కోట్లను లబ్దిదారులకు విడుదల చేస్తూ సిఎం జగన్ బటన్ నొక్కారు. ఖజానాలో తగినన్ని నిధులు ఉన్నా వాటిని బటన్ నొక్కిన వెంటనే విడుదల చేయకుండా ఎన్నికల పోలింగ్ వరకు వేచి చూశారని, పోలింగ్ ముందు ఖాతాల్లో జమ చేసేందుకు రెడీ అయ్యారని ఆరోపించింది. పోలింగ్ ముగిసిన తర్వాత లబ్దిదారులకు నగదు చెల్లించకుండా తాత్సారం చేస్తోందని టీడీపీ ఆరోపించింది. ఖజానాలో ఉన్న డబ్బును కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. తాజాగా వాటిని చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

 

Whats_app_banner

సంబంధిత కథనం