పీఎం-జన్‌మన్ పథకం తొలి విడత నిధుల విడుదల.. లక్ష మంది లబ్ధిదారులకు అందజేత
సుమారు రూ. 24,000 కోట్ల బడ్జెట్‌తో ప్రధాన మంత్రి జన్‌జాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ 11 కీలక చర్యలపై దృష్టి సారించింది.
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్) కింద లక్ష మంది లబ్ధిదారులకు గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) మొదటి విడతను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు.
మొదటి విడతగా రూ. 540 కోట్లను విడుదల చేసిన ప్రధాని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాలనను పేదల సంక్షేమానికి అంకితం చేసిందన్నారు.
ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రభుత్వం పదేళ్లను పేదలకు అంకితం చేసిందని మోదీ పేర్కొన్నారు.
గత దశాబ్దంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ పథకాల బడ్జెట్ ఐదు రెట్లు పెరిగిందని, గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు రెండున్నర రెట్లు పెరిగాయని ప్రధాని తెలిపారు.
గిరిజన విద్యార్థుల కోసం గతంలో 90గా ఉన్న ఏకలవ్య మోడల్ స్కూళ్లను 500కు పైగా నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.
సుమారు రూ. 24,000 కోట్ల బడ్జెట్ తో పీఎం-జన్‌మన్ తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా 11 కీలక చర్యలపై దృష్టి సారించింది. సురక్షితమైన గృహనిర్మాణం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, మెరుగైన విద్య, ఆరోగ్యం- పోషకాహారం, విద్యుత్, రహదారి, టెలికాం కనెక్టివిటీ వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడం ద్వారా ముఖ్యంగా బలహీనమైన గిరిజన సమూహాల (పివిటిజి) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే స్థిరమైన జీవనోపాధి అవకాశాలు అందించాలని భావిస్తోంది.
పిఎం-జన్‌మన్ పథకానికి మార్గదర్శకత్వం వహించిన భారతదేశపు మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అదే నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తిగా, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె తరచుగా మాట్లాడారని అన్నారు.
వంటగ్యాస్ కనెక్షన్లు, విద్యుత్, పైపుల ద్వారా మంచినీరు, గృహనిర్మాణం కోసం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న తర్వాత వారి జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పులపై లబ్ధిదారులతో ఆయన ముచ్చటించారు.