YSR Asara: అనంతపురంలో నేడు ఆసరా నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్
YSR Asara: ఏపీలో నాలుగో విడత 'వైఎస్సార్ ఆసరా' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రారంభించనున్నారు
YSR Asara: ముఖ్యమంత్రి జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూర్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.19,175.97 కోట్లు జమ చేశారు. తాజాగా, మంగళవారం నుంచి నాలుగో విడతలో రూ.6,394.83 కోట్లను జమచేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) గణాంకాల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది డ్వాక్రా మహిళల పేరిట రూ.25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లను ఆయా మహిళల ఖాతాల్లో జమచేశారు. ఇక మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను కూడా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో నాలుగు విడతల్లో 2019 ఎన్నికల నాటికి SLBC తుది జాబితా ప్రకారం ఉన్నరూ. 25,571 కోట్ల రుణాన్నితీరుస్తామన్న హామీ నెరవేరుతుందని చెబుతున్నారు.
నేడు అందిస్తున్న వైఎస్సార్ ఆసరా లబ్దితో ఈ 56 నెలల కాలంలో నేరుగా DBT (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా అందించిన లబ్ధి రూ.2.50 లక్షల కోట్లు దాటనుంది,. వివిధ పథకాల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే గత 56 నెలల్లో జగన్ ప్రభుత్వం .రూ. 2,66,772.55 కోట్లను నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేసింది.
డ్వాక్రా మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా, వారి జీవనోపాధి మెరుగుపడేలా.. అమూల్, హిందూస్తాన్ లివర్, ఐ.టి.సి., పి&జి. అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
వైఎస్సార్ ఆసరా మైలు రాళ్లు
మొదటి విడత, 11 సెప్టెంబర్ 2020
అందించిన లబ్ధి రూ.6,318.76 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 77,87,295
రెండవ విడత, 07 అక్టోబర్ 2021
అందించిన లబ్ధి రూ.6,439.52 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,75,539
మూడవ విడత, 25 మార్చి 2023
అందించిన లబ్ధి రూ.6,417.69 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169
నాల్గవ విడత, 23 జనవరి 2024
అందించిన లబ్ధి రూ.6,394.83 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169
వైఎస్సార్ ఆసరా ద్వారా 4 విడతల్లో అందించిన మొత్తం లబ్ధి రూ. 25,571 కోట్లు డ్వాక్రా మహిళలకు అందించినట్టు చెబుతున్నారు.