తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Brahmotsvam From September 27 To October 5th

Tirumala brahmotsavam 2022 dates: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే..

HT Telugu Desk HT Telugu

03 September 2022, 9:41 IST

    • Tirumala brahmotsavam 2022 dates: తిరుమలలో రెండేళ్ల తర్వాత నిర్వహిస్తోన్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5 వ‌ర‌కు మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు నిర్వహిస్తారు. 
తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమల బ్రహ్మోత్సవాలు

Tirumala brahmotsavam 2022 dates: తిరుమ‌ల‌లో రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వ‌హించేందుకు టిటిడి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

కోవిడ్ కార‌ణంగా రెండేళ్ల‌ుగా ఆల‌యంలో ఏకాంతంగా బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. ఈసారి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని టిటిడి అంచ‌నా వేస్తోంది. ఈ క్ర‌మంలో భ‌క్తుల‌కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతోంది. బ్రహ్మోత్స‌వాల్లో తొమ్మిది రోజుల పాటు జ‌రుగ‌నున్న వాహ‌న‌సేవల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబ‌ద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగ‌నుంది.

సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు:

సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంట‌ల మ‌ధ్య‌ అంకురార్పణ చేస్తారు. సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనంపై ఊరేగింపు ఉంటుంది.

-సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనంపై విహరిస్తారు.

సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనంపై ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.

సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు.

అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనంపై భక్తులకు కనిపిస్తారు.

అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు.

అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై కనిపిస్తారు.

అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనంపై విహరిస్తారు.

అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం నిర్వహిస్తారు.