Rains In Andhra Pradesh : రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
04 September 2022, 19:59 IST
- IMD Rain Alert : వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఉంది. ఆగస్టు 5 నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు.. తెలంగాణలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమోరిన్ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక అంతటా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపింది.