APPSC Job Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్
07 September 2022, 21:46 IST
- APPSC Jobs : ఏపీలో త్వరలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు వెళ్లాయి.
ఏపీపీఎస్సీ
ఏపీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో త్వరలో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు చెప్పారు. ప్రస్తుతం కళాశాలల్లో డిప్యుటేషన్‌పై అధ్యాపకులు పనిచేస్తున్నారని తెలిపారు. తక్కువ మంది లెక్చరర్స్ ఉన్న.. కాలేజీలకు డిప్యూటేషన్ మీద వెళ్తున్నారు. ఇకపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించనున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించామని వెల్లడించారు. ఉన్నత విద్యతోపాటు ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామన్నారు.
'ప్రస్తుతం చాలా డిగ్రీ కళాశాలలో డిప్యుటేషన్‌పై అధ్యాపకులు పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించాం. మంచి ఉన్నత విద్యతో పాటు ఉపాధికి సంబంధించి భవిష్యత్‌కు బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నాం.' అని భాస్కరరావు చెప్పారు.
ఉద్యోగాల పరీక్షా షెడ్యూల్ విడుదల
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టే నియమకాలకు సంబంధించి పరీక్షా తేదీలను విడుదల చేశారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, సబ్జెక్ట్ పేపర్ పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఏపీపీఎస్సీ 2021లో విడుదల చేసిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను విడుదల చేసింది. గెజిటెడ్ విభాగంలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు అక్టోబర్ 21న జరుగుతాయి. సబ్జెక్ట్ పేపర్ పరీక్షల్లో పేపర్ 2 19వ తేదీ ఉదయం, పేపర్ 3 మధ్యాహ్నం నిర్వహిస్తారు.
ఏపీ సెరికల్చర్‌సర్వీస్‌లోని సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు అక్టోబర్ 21 మధ్యాహ్నం జరుగుతాయి. పేపర్ 2, 20వ తేదీ ఉదయం, పేపర్ 3 మధ్యాహ్నం నిర్వహిస్తారు.
ఏపీ అగ్రికల్చర్ సర్వీసెస్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అక్టోబర్ 21న జిఎస్ఎంఏ పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబర్ 20 ఉదయం పేపర్ 2, మధ్యాహ్నం పేపర్ 3 నిర్వహిస్తారు. డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు నవంబర్ 3 ఉదయం పేపర్ 2, మధ్యాహ్నం పేపర్ 3 పరీక్షలు జరుగుతాయి. నవంబర్ 7న జిఎస్‌ఎంఏ పరీక్షలు నిర్వహిస్తారు.
ఏపీ పోలీస్ సర్వీస్‌లోని టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షలు అక్టోబర్ 21న జరుగుతాయి. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగాలకు అక్టోబర్ 19, 21 తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారు. హార్టికల్చర్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు అక్టోబర్ 20, 21 తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారు. హార్టికల్చర్ విభాగంలో సాధారణ నియమకాలకు సంబంధించిన పరీక్షల్లో అర్హత పరీక్ష అక్టోబర్ 18న జరుగుతుంది. అక్టోబర్ 20, 21 తేదీలలో సబ్జెక్టు పరీక్షలు నిర్వహిస్తారు.
ఏపీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సర్వీసెస్‌లో నియామకాలకు సంబంధించిన పరీక్షలు అక్టోబర్ 21వ తేదీన నిర్వహిస్తారు. నాన్ గెజిటెడ్ విభాగంలో ఏపీఆర్వో పోస్టులకు, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ పోస్టులకు,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, అసెంబ్లీలో తెలుగు రిపోర్టర్లు, జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులు, మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు జిఎస్‌ఏంఏ పరీక్షను నవంబర్ 7న నిర్వహిస్తారు. సబ్జెక్ట్ పరీక్షలను నవంబర్ 4,5,6, 7 తేదీలలో నిర్వహిస్తారు.
అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుకు జనరల్ స్టడీస్ పరీక్ష నవంబర్ 9న నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం అర్హత పరీక్ష, 10,11 తేదీలలో సబ్జెక్ట్ పేపర్ పరీక్షలు జరుగుతాయి.