Tiger Terror : పులికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ వార్నింగ్….-forest department pays compensation to wild animal attack victims ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Forest Department Pays Compensation To Wild Animal Attack Victims

Tiger Terror : పులికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ వార్నింగ్….

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 07:54 AM IST

విజయనగరంలో పులి సంచరం, పశువులపై దాడులు చేస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిస్తోంది. పులి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తిరిగి వెళ్ళిపోతుందని అంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పులి తిరుగుతున్న ప్రాంతాాల్లో అటవీ శాఖ అధికారుల పర్యటన
పులి తిరుగుతున్న ప్రాంతాాల్లో అటవీ శాఖ అధికారుల పర్యటన

ఉత్తరాంధ్రలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పులి సంచారంపై జిల్లా అట‌వీ శాఖ అధికారుల అప్రమత్తమయ్యారు. పులి తిరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. పులి దాడిలో మ‌ర‌ణించిన ప‌శువుల‌కు న‌ష్ట‌ప‌రిహారం పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా నుంచి పులి త‌న ఆవాస ప్రాంతానికి చేరే వ‌ర‌కు ప్ర‌జ‌లు సంయ‌మ‌నంతో ఉండాలని విశాఖలోని అట‌వీ సంర‌క్ష‌ణాధికారి పి.రామ్మోహ‌న రావు కోరారు.

ట్రెండింగ్ వార్తలు

పులి రాత్రి వేళ‌ల్లో తెల్ల‌వారు ఝామున సంచ‌రించే అవ‌కాశం ఉంటుందని, నాలుగు కాళ్ల జంతువుల‌నే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంద‌ని అందువ‌ల్ల పులి సంచ‌రించే ప్రాంతాల్లో ప్ర‌జ‌లు రాత్రివేళ‌ల్లో ఆరు బ‌య‌ట సంచ‌రించ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరారు. జిల్లా అట‌వీ శాఖ అధికారులు ఇటీవ‌ల పులి సంచ‌రించిన పులిగుమ్మి, షికారుగంజి గ్రామాల‌ అట‌వీ ప్రాంతం, ప‌రిస‌ర గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా ప‌ర్య‌టించి వాటి పాద‌ ముద్ర‌లు ప‌రిశీలించారు. ఆయా గ్రామాల ప్ర‌జ‌ల‌తో మాట్లాడి వారికి జాగ్ర‌త్త‌లు చేప‌ట్టాల‌ని కోరారు.

పులి స్వ‌త‌హాగా బిడియ స్వ‌భావం క‌లిగిన జంతువ‌ని, మ‌నుషుల నుంచి సాధ్య‌మైనంత దూరంగా వుండ‌టానికి ప్ర‌య‌త్నిస్తూ క‌న‌ప‌డ‌కుండా ఉండేందుకు ఇష్ట‌ ప‌డుతుంద‌న్నారు. అటవీ ప్రాంతాలలో ఆక‌స్మాత్తుగా మ‌నుషుల ఉనికిని గమనిస్తే పులి దాడిచేసే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చరిస్తున్నారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌డం, ప్ర‌జ‌లు ఆరుబ‌య‌ట నిద్రించడం, సంచారం లేని ప్ర‌దేశాల్లో ఒంట‌రిగా తిర‌గ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఒంటరిగా అడవుల్లోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

ప‌రిహారం పంపిణీ…..

పులి దాడిలో మృతి చెందిన ఆవుల‌కు రూ.35,000 ప‌రిహారంగా అంద‌ చేశారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌ నర‌స‌య్య, ఆవుల‌ను కోల్పోయిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు చెక్కు రూపంలో పరిహారం అందచేశారు. మీరట్‌ నుంచి తెప్పించిన బోను సాయంతో పులిని బంధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైల్డ్ లైఫ్ రెస్క్యూ వ్యాన్ కూడా జిల్లాలో అందుబాటులో ఉంచారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో పులికి సంబంధించి ప‌రిష్కారం లభిస్తుందని అటవీ శాఖ ఆశాభావంతో ఉంది.

WhatsApp channel

టాపిక్