తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Mp Vijayasai Reddy's Past Success In Ycp, Again A Key Role In The Party's Activities

Saireddy ReEntry: వైసీపీలో సాయిరెడ్డి యాక్టివ్... అనుబంధ సంఘాలతో సమీక్ష

HT Telugu Desk HT Telugu

07 June 2023, 6:09 IST

    • Saireddy ReEntry: అంతా అనుకున్నట్టే వైఎస్సార్సీపీలో  ఎంపీ విజయసాయిరెడ్డి  రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఆరేడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు పూర్తి దూరంగా, ఢిల్లీకే పరిమితమైన సాయిరెడ్డి మళ్లీ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. 
అనుబంధ విభాగాలతో సమీక్ష నిర్వహిస్తున్న సాయిరెడ్డి
అనుబంధ విభాగాలతో సమీక్ష నిర్వహిస్తున్న సాయిరెడ్డి

అనుబంధ విభాగాలతో సమీక్ష నిర్వహిస్తున్న సాయిరెడ్డి

Saireddy ReEntry: వైఎస్సార్సీపీ వ్యవహారాలతో కొన్నాళ్లుగా అంటిముట్టన్నట్టు వ్యవహరించిన ఎంపీ సాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత ఏడాది కాలంలో జరిగిన రకరకాల పరిణామాాలతో మొదట ఎంపీ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. దీనికి ఆయన నొచ్చుకున్నా తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను నడిపించవచ్చని భావించారు. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలతో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత పార్టీ అనుబంధ విభాగాల పర్యవేక్షణకు కూడా ఆయన దూరంగా ఉండిపోయారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే సాయిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంటున్నారని ప్రచారం జరిగింది.

గుంటూరులో వైసీపీ ప్లీనరీ జరిగిన తర్వాత సాయిరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు కూడా లేవు. తనకు తాను దూరంగా ఉండిపోవడంతో వైసీపీలో ఏం జరుగుతుందనే చర్చజరిగింది. ఇదే సమయంలో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ పాలసీ వ్యవహారం కూడా వైసీపీ అధినేత ఆగ్రహానికి కారణమైందని ప్రచారం జరిగింది.

అదే సమయంలో పార్టీలో ఇతరులకు కీలక బాధ్యతలు అప్పగించినా వాటిని సమర్ధవంతంగా హ్యాండిల్ చేయడంలో వారు విఫలమయ్యారనే భావనకు పార్టీ అధిష్టానం వచ్చినట్టు కనిపించింది. వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలక స్థానాల్లో ఉన్న వారు కీలకమైన సమయాల్లో తగిన విధంగా స్పందించడం లేదనే భావన పార్టీ ముఖ్యులకు రావడంతోనే సాయిరెడ్డి పునరాగమనం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

దాదాపు రెండు నెలలుగా సాయిరెడ్డి మళ్లీ తాడేపల్లిలో యాక్టివ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రకాశం జిల్లాలో బాలినేని రాజీనామాతో ఖాళీ అయిన ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా ఆయన చూస్తారని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే ప్రకాశం బాధ్యతలు తీసుకోడానికి సాయిరెడ్డి విముఖత చూపడం, బాలినేని వంటి వారితో అనవసర వివాదాల్లో తలదూర్చడం ఎందుకని భావించినట్లు సన్నిహితులు చెబుతూ వచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో సాయిరెడ్డి అవసరాన్ని వైసీపీ అధిష్టానం గుర్తించినట్లు సాయిరెడ్డి వర్గం నేతలు చెబుతుండే వారు. సాయిరెడ్డి స్థానంలో ఇతరులకు బాధ్యతలు అప్పగించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో పార్టీ పెద్దలు అతనికే మళ్లీ బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షతో వైసీపీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన సాయిరెడ్డికి పూర్వ వైభవం వచ్చేసిందని ఆయన అభిమానులు చెబుతున్నారు.

మరోవైపు మంగళవారం సాయిరెడ్డి వైఎస్ఆర్ సిపి అనుబంధ విభాగాల సమావేశాన్ని నిర్వహించారు.ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించారు.అనుబంధ విభాగాలలో ఖాళీగా ఉన్న పధవులను త్వరితగతిన భర్తీ చేయాలని, అలాగే గతంలో పార్డీ నిర్వహించిన జయహో బీసీ సమావేశం మాదిరిగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సమావేశాలు రాష్ట్ర స్ధాయీలో నిర్వహించాలని యోచించారు.

వివిధ సామాజిక వర్గాలకు, విభాగాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు,కార్యక్రమాలు ఇంటింటికీ ప్రచారం చేయడంపై నేతలతో చర్చించారు. అలాగే అనుబంధ విభాగాల అధ్యక్షులకు అధనంగా మరికొంత మందిని నియమించడంపై సాధ్యాసాధ్యాలపై సమావేశమంలో చర్చలు జరిపారు.

ప్రతి పక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు గెలుపు కోసం అనుబంధ విభాగాలు పార్టీ కోసం ఎలా పని చేశాయో, 2024 గెలుపు కోసం సమిష్టిగా పని చేయాలని సాయిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు.

వీలైనంత త్వరగా పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులు, మండల ఇంచార్జిల ఖాళీలను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుని అనుబంధ విభాగాల అధ్యక్షులు భర్తీ చేయాలని సూచించారు.

జయహో బిసి మహాసభ ఎలా అయితే విజయవంతమైందో త్వరలో పార్టీ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ,ముస్లిం మైనారిటీ మహాసభలు విజయవంతం అయ్యేలా అనుబంధ విభాగాల అధ్యక్షులు కృషి చెయాలని సూచించారు. ఈ విషయంలో ఏదైనా సమస్యలుంటే అనుబంధ విభాగాల అధ్యక్షులు తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.