తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Karnataka State Police Arrests Ysrcp Leader And Bondili Corporation Chairman In Bengaluru

Fake Note Racket : సిఎం ఇలాకాలో… సొంత పార్టీలో దొంగ నోట్ల ముఠా…..

HT Telugu Desk HT Telugu

27 January 2023, 8:22 IST

    • Fake Note Racket ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్  డైరెక్టర్‌ను కర్ణాటక పోలీసులు దొంగ నోట్ల  కేసులో అరెస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది. ఈ కేసులో మరికొన్ని పెద్ద తలకాయలున్నాయని జిల్లాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.  అధికార పార్టీ ముఖ్య నాయకుల అండదండలతోనే  దొంగ నోట్ల దందా జరుగుతున్నట్లు  విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
దొంగనోట్ల వ్యవహారంలో వైసీపీనాయకురాలి అరెస్ట్
దొంగనోట్ల వ్యవహారంలో వైసీపీనాయకురాలి అరెస్ట్

దొంగనోట్ల వ్యవహారంలో వైసీపీనాయకురాలి అరెస్ట్

Fake Note Racket వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్ రసపుత్ర రజనిని నకిలీ నోట్ల చలామణి కేసులో కర్ణాటక పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. వైసీపీలో ముఖ్య నేతలతో ఉన్న పరిచయాలు, కార్పొరేషన్‌ పదవిని అడ్డంపెట్టుకుని రజిని దొంగనోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

బెంగుళూరులోని సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్‌తో పాటు రజనినిఅరెస్టు చేశారు. రజిని ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీలో కీలక నాయకురాలిగా ఉణ్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అండ దండలతో కార్పొరేషన్‌ డైరెక్టరు పదవి దక్కించుకున్నారు. పదవీకాలం ముగియడంతో ఆమెకు తిరిగి పదవిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రజిని వద్ద రూ.44 లక్షల విలువగల రూ.500 నకిలీ నోట్లను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి నకిలీ నోట్లను తక్కువకు కొనుగోలు చేసి బెంగళూరులో చలామణి చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అనుచరురాలిగా ఉన్న మహిళా నాయకురాలిని దొంగనోట్ల కేసులో పోలీసులు అరెస్ట్‌చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. 2017లో ప్రొద్దుటూరులో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీమొత్తంలో డబ్బు వసూలు చేసి ఐపీ పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలోని పెద్దలతో ఫొటోలు దిగి, వాటిని నిరుద్యోగులకు చూపించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.

మరోవైపు బెంగుళూరు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అనంతపురంలోనే వాటిని తయారు చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారని బెంగళూరు పశ్చిమ అదనపు పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు. చరణ్‌సింగ్‌, రజని, గోపీనాథ్‌, పుల్లలరేవు రాజాలను నిందితులుగా గుర్తించి, అరెస్టు చేసినట్లు చెప్పారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు...వారిని వైఎస్సాఆర్‌, అనంతపురం జిల్లాలకు తీసుకొచ్చి నకిలీ నోట్ల ముద్రణ కేంద్రాలు, నగదు భద్రపరిచే స్థావరాల్లో దాడులు నిర్వహించారు. రూ.11 లక్షల నకిలీ నోట్లు, వాటిని ముద్రించేందుకు ఉపయోగించే యంత్రాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధాలున్న గోపీనాథ్‌, రాజా అనే మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులోని ఉత్తరాహళ్లి-కెంగేరి ప్రధాన రహదారిలో పూర్ణప్రజ్ఞా లే అవుట్‌ సాధనా కళాశాల వద్ద బొలెరో వాహనంలో నకిలీ నోట్ల కట్టలు పెట్టుకుని.. వాటిని మారుస్తూ రజని కర్ణాటక పోలీసులకు పట్టుబడ్డారు. ఆమె వద్ద రూ.44.09 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్‌, రజని కలిసి అనంతపురం, చిక్కబళ్లాపురాలకు చెందిన బృందాల నుంచి నకిలీ నోట్లను సేకరించేవారని దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న అనంతపురంకు చెందిన పుల్లలరేవు రాజా నకిలీ నోట్ల తయారీలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాడని పోలీసు అధికారి సందీప్‌ పాటిల్‌ వివరించారు. రాజాకు సాంకేతిక సహకారం అందిస్తున్న గోపీనాథ్‌ అనే వ్యక్తి గురించీ వివరాలు రాబడుతున్నారు.

దొంగనోట్ల దందాలో ఎమ్మెల్యే హస్తం…టీడీపీ ఆరోపణ

నకిలీ నోట్ల చలామణి ముఠాతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి సంబంధాలున్నట్లు టీడీపీ ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే రజని దొంగనోట్లు మార్చుతున్నట్లు విమర్శించారు. ప్రొద్దుటూరులో అప్పులు చేసి ఐపీ పెట్టిన మహిళకు... ఎమ్మెల్యే స్వయంగా కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇప్పించారని ఆరోపించారు. దొంగనోట్ల తయారీ, చలామణిలో ఎమ్మెల్యేనే సూత్రధారి అని, ఈ వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

సంబంధం లేదన్న ఎమ్మెల్యే రాచమల్లు

రజని దొంగనోట్ల వ్యవహారంపై తనకెలాంటి సంబంధమూ లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి నుంచి సస్పెండు చేస్తూ అధిష్ఠానానికి నివేదిక పంపినట్లు చెప్పారు..

టాపిక్