AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల
02 May 2024, 6:20 IST
- AP TS Summer Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. పగటి పూట అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఏపీ తెలంగాణల్లో మండిపోతున్న ఎండలు
AP TS Summer Updates: ఏపీలో ఎండల Summer తీవ్రత మరింత పెరిగింది. బుధవారం పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2°డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46°డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 45.8°డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7°డిగ్రీలు, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6°డిగ్రీలు, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5°డిగ్రీలు, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.9°డిగ్రీలు, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6°డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.5°డిగ్రీలు, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44° డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో 43°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 79 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
నేడు AP ఏపీలో 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, శుక్రవారం 30 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 121 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ IMD ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గురువారం తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు
- శ్రీకాకుళం 5 , విజయనగరం 15, పార్వతీపురంమన్యం 8 , ప్రకాశం 2, అల్లూరిసీతారామరాజు ఒక మండలంలో Severe Heat Waves తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు
శ్రీకాకుళం15 , విజయనగరం 10, పార్వతీపురంమన్యం 7, అల్లూరిసీతారామరాజు 9, విశాఖపట్నం1, అనకాపల్లి 15, కాకినాడ 13, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 1, ఏలూరు 18, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, గుంటూరు 16, పల్నాడు 21, బాపట్ల 11, ప్రకాశం 18, తిరుపతి 12, నెల్లూరు16, అనంతపురం 1, వైయస్సార్ 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్,కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
తెలంగాణలో మంటలు…
తెలంగాణలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండలు రోజురోజుకు తీవ్రం అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పదేళ్ల గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల్లోని 20మండలాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలకు మించి నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 46.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని పలు మండలాల్లో 46.5 డిగ్రీల నుంచి 46.2డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సగటు కంటే అధికం...
తెలంగాణలో సగటు ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3డిగ్రీలు అధికంగా పలు చోట్ల నమోదు అవుతున్నాయి. గత ఏడాది మే 1తో పోలిస్తే 2024 మే 1న 7.5డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. జగిత్యాలలో గత ఏడాది 35.6డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే ఈ ఏడాది 45.6 డిగ్రీలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలోని 8 మండలాలు, జగిత్యాలలో 6, కరీంనగర్‌లో 4, సిద్ధిపేటలో 3, మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్‌లో 2 మండలాల్లో వడగాలు నమోదయ్యాయి.
తెలంగాణ ఎండ వేడికి తాళలేక పలువురు ప్రాణాలు విడిచారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలోని బూడిజంగాల కాలనీలో దివ్యాంగుడైన బాలుడు రేకుల ఇంట్లో వేడికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న వికారాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు తాండూరులో ప్రాణాలు కోల్పోయింది. బషీరాబాద్ టాకీతండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న రాణి తాండూరులో ఎనన్ికల శిక్షణకు హాజరయ్యారు. బషీరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చారు. తలనొప్పిగా ఉందని చెబుతూ సొమ్మసిల్లి పడిపోయారు. తోటి ఉపాధ్యాయులు తాండూరు ఆస్పత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు హైదరాబాద్‌లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు అయ్యాయి. కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా తరువాత గరిష్ఠంగా 42డిగ్రీలు నమోదుకాగా ఈ వేసవిలో మాత్రం పగలు ఉష్ణోగ్రతలు 43డిగ్రీలను దాటేయడం రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30డిగ్రీలకు చేరుకోవడంతో పాటు , గాలిలో తేమ 20శాతం కంటే కిందకు పడిపోవడంతో ఎండ వేడి, వడగాల్పులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బుధవారం హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.0డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.9డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. గాలిలో తేమ 16శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో గ్రేటర్‌లో వడగాల్పులు వీస్తున్నాయి.