Jr NTR : మీ విజయం ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది- చంద్రబాబు, పవన్ కు జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు
05 June 2024, 16:13 IST
- Jr NTR : ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు, పవన్ కు జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు
Jr NTR : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. ఈ పార్టీల అధినేతలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తున్నాయి. అయితే తాజాగా జూ.ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ, భరత్, పురందేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు.
"ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకి, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. వరుసగా మూడోసారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్ కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేశ్, భరత్, పురందేశ్వరి అత్తకు నా శుభాకాంక్షలు" అన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. "చారిత్రాత్మక విజయం సాధించిన ప్రియమైన పవన్ కల్యాణ్ కు అభినందనలు. మీ కంటే దీనికి ఎవరూ అర్హులు కాదు. మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి, అంకితభావంతో స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నాను. పిఠాపురం ఎమ్మెల్యే గారు మీకు శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.