తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan Kalyan Chandrababu: నేడు ఢిల్లీకి పవన్ చంద్రబాబు, వైసీపీపై కక్ష సాధింపులు ఉండవన్నపవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Chandrababu: నేడు ఢిల్లీకి పవన్ చంద్రబాబు, వైసీపీపై కక్ష సాధింపులు ఉండవన్నపవన్ కళ్యాణ్‌

Sarath chandra.B HT Telugu

05 June 2024, 6:04 IST

google News
    • Pawan Kalyan Chandrababu: సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన టీడీపీ, జనసేనలు జూన్ 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. వైసీపీపై కక్ష సాధింపులకు పాల్పడమని జనసేన అధ్యక్షుడు పవన్ ప్రకటించారు. 
వైసీపీపై కక్ష సాధింపులకు పాల్పడమని ప్రకటించిన పవన్
వైసీపీపై కక్ష సాధింపులకు పాల్పడమని ప్రకటించిన పవన్

వైసీపీపై కక్ష సాధింపులకు పాల్పడమని ప్రకటించిన పవన్

Pawan Kalyan Chandrababu: జనసేనను 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత బలంగా నమ్మారంటే- పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడం సాధారణ విషయం కాదని, దేశంలో మరే పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా 100 శాతం విజయాన్ని ఇప్పటి వరకు అందుకోలేదని, విజయం వల్ల నాకిప్పుడు అహంకారం కలగలేదని ఆ విజయాన్ని బాధ్యతగా భావిస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రజలు ఏకపక్షంగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. జూన్ 9న ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు ఏపీలో దక్కిన విజయంతో నమ్మిన ప్రజల ఆకాంక్షను తీర్చాల్సిన అతి పెద్ద బాధ్యతగా స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు చీకట్లు వీడిపోయే సమయం వచ్చిందని, చాలా జాగ్రత్తగా, ప్రజలకు జవాబుదారీగా పాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన పవన్‌కు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు జయజయ ధ్వానాలతో ఘన స్వాగతం పలికారు.

కక్ష సాధింపులకు అధికారాన్ని వాడుకోం…

“ఐదు కోట్ల మంది ఆంధ్రులు చారిత్రాత్మక తీర్పునిచ్చారని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ప్రజలకు జవాబుదారీ పాలన అనే మాటకు కట్టుబడి ఉంటమని ప్రకటించారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. రాష్ట్ర పునాదులు బలంగా వేసేందుకు పని చేస్తాం. ఎవరిపైనా కక్షలు తీర్చుకోవడానికో, రాజకీయ శత్రువులను ఇబ్బందిపెట్టడానికో పని చేయమన్నారు. ఇది అత్యంత కీలకమైన సమయమని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే సమయమన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నలుగుతున్న రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేయాలని ఓ తపస్సులా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేలా పాలన ఉంటుందన్నారు.

జగన్ మీద వ్యక్తిగత ద్వేషం ఎప్పటికీ ఉండదు

వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మీద ఎప్పటికీ వ్యక్తిగత ద్వేషం ఉండదని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గౌరవిస్తామని పవన్ ప్రకటించారు. వైసీపీ ఓడిపోయింది కదా అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను హింసించడానికి కూటమి ప్రభుత్వం పని చేయదని వైసీపీని ఇబ్బందిపెట్టడానికి ప్రజలు ఇంతటి విజయం అందించలేదన్నారు. ఈ విషయాన్ని జన సైనికులు, నాయకులు, వీర మహిళలు గుర్తుంచుకోవాలని వ్యవస్థలను రక్షించడానికి, గౌరవించడానికి తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు.

తన జీవితంలో విజయాలు అంత తేలిగ్గా రాలేదని తొలి ప్రేమ మొదటి విజయం తర్వాత సినిమాల్లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయిందని నేను రాజకీయాల్లోకి డబ్బు కోసమో, కీర్తి కోసమో రాలేదు. సగటు మనిషి పడే బాధలు, వేదనలు నాలో కలిగి వాటికి సమాధానం వెతికే ప్రయత్నంలోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సామాన్యుడి బాధలు, యాతనలు ఎవరూ తీర్చలేరా? అనే ప్రశ్నే నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందన్నారు. సామాన్యుడికి పూర్తి స్థాయిలో భరోసాగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కావాలి అని బలంగా కోరుకున్నారని పాలన మారాలి అని ఆకాంక్షించారని అది తీరిందన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ బలమైన పునాదులు నిర్మించాల్సి ఉందన్నారు.

ఏరు దాటాక తెప్ప తగలేసేవాడిని కాదు

ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. పది మందికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచేలా, ఆడ బిడ్డలకు పూర్తి స్థాయి రక్షణ అందించేలా, మహిళలను సర్వ సత్తాకంగా నిలిపేందుకు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సావధానంగా వినేలా, యువత ఆకాంక్షలు తీరేలా, కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ఎన్నికల ముందు ఉద్యోగులకు సీపీఎస్ రద్దు మీద హామీ ఇచ్చామని దాని పరిష్కారానికి అందరూ మెచ్చేలా ఏడాదిలో పరిష్కార మార్గం చూపిస్తామన్నారు. నేను ఏ సమస్య కూడా వదిలేసేవాడిని కాదని ఏరుదాటాక తెప్ప తగలేసే రకం అసలే కాదన్నారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేలా పాలన ఉంటుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత తీసుకుంటా. యువతకు సరైన మార్గంలో నైపుణ్యం అందించి వారికి తగిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బలంగా ఉండేలా పని చేస్తాం. వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గించి ఎవరి పని వారు సక్రమంగా చేసేలా చూస్తాం. రైతుకు అనుకోని కష్టం వస్తే అక్కున చేర్చుకునే ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారు. సగటు మనిషికి భుజం కాసే ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారన్నారు.

వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు…

తనను గెలిపించిన పిఠాపురం ప్రజలందరికీ అక్కడి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకు పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పిఠాపురం ప్రజలు ఆకాశమంత విజయం ఇచ్చారని, నిర్మాణాత్మకంగా నిలబడతామన్నారు. ప్రజలకు అండగా ఉంటామని, ప్రజలంతా పవన్ కళ్యాణ్ అంటే ఎవరో బయటి వ్యక్తి.. నాయకుడు అనుకోవద్దని పవన్ కళ్యాణ్ మీ ఇంట్లోని వాడు, మీ కుటుంబ సభ్యుడు అనుకోవాలన్నారు. ఏ కష్టం వచ్చినా నా కార్యాలయం తలుపులు, నా ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయి” అన్నారు.

తదుపరి వ్యాసం