Uravakonda Sentiment: ఉరవకొండ సెంటిమెంట్ పటాపంచలు…ఉరవకొండతో పాటు రాష్ట్రంలో టీడీపీ ఘన విజయం
Uravakonda Sentiment: ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఉరవకొండ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఉరవకొండలోనూ, రాష్ట్రంలో టీడీపీ ఘన విజయం సాధించింది.
Uravakonda Sentiment: రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు ఉండే సెంటిమెంట్లన్ని పటాపంచలు అయ్యాయి. గత ఎన్నికల్లో పిఠాపురం సెంటిమెంట్ బద్దలుకాగా, ఈ ఎన్నికల్లో ఉరవకొండ సెంటిమెంట్ బద్దలైంది.
అసలు ఉరవకొండ సెంటిమెంట్ ఏమిటి?
అనంతపురం జిల్లాలో ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సెంటిమెంట్, ఈ ఎన్నికల ఫలితాలు బద్ధలు చేశాయి. ఉరవకొండ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎప్పుడూ ఉరవకొండలో గెలిచిన పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా ఈ సెంటిమెంట్ కొనసాగుతుంది. ఈ సెంటిమెంట్ కు భిన్నంగా ఉరవకొండలో గెలిచిన పార్టీ, రాష్ట్రంలో కూడా ఆ పార్టీనే విజయం సాధించింది.
ఉరవకొండలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో ఆయన తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గెలుపొందారు. అదే సమయంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ఎప్పుడూ భిన్నమైన ఫలితలాఏ వచ్చాయి.
1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వై.శివరామి రెడ్డి చేతులో టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ ఓటమి చెందారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గెలుపొందారు. కానీ అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
2009 ఎన్నికల్లో మళ్లీ పయ్యావుల కేశవ్ గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రెండుసార్లు పయ్యావుల కేశవ్ ప్రతిపక్షంలోనే ఉన్నారు.
2014 ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వర రెడ్డి చేతులో పయ్యావుల కేశవ్ ఓటమి చెందారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే ఈ సాంప్రదాయం, ఈ సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో బద్ధలు అయ్యాయి. ఈసారి ఇటు ఉరవకొండలోనూ, అటు రాష్ట్రంలోనూ టీడీపీనే విజయం సాధించింది. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలవగా, రాష్ట్రంలో టీడీపీ కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డిపై 21,704 ఓట్ల తేడాతో పయ్యావుల కేశవ్ గెలుపొందారు. ఈ గెలుపుతో ఉరవకొండ సెంటిమెంట్ రూపుమారింది.
గత ఎన్నికల్లో పిఠాపురం సెంటిమెంట్ బద్ధలు
గత ఎన్నికల్లో పిఠాపురం సెంటిమెంట్ బద్ధలు అయింది. పిఠాపురంలో కూడా సరిగ్గా ఉరవకొండ లాంటి సెంటిమెంటే ఉంది. పిఠాపురంలో గెలిచిన పార్టీ, రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది. దశాబ్దాలుగా అదే సెంటిమెంట్ కొనసాగింది అయితే గత ఎన్నికల్లో పిఠాపురంలో వైసీపీ గెలుపొందింది. అలాగే రాష్ట్రంలో కూడా వైసీపీ విజయం సాధించింది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో సాంప్రదాయానికి బ్రేకులు పడతాయి.
( రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)