Pawan Kalyan Tholi Prema: అప్పుడు తొలిప్రేమ విజయం.. ఇప్పుడీ విజయం..: పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్
Pawan Kalyan Tholi Prema: పవన్ కల్యాణ్ తన తాజా ఎన్నికల విజయాన్ని తాను సినిమాల్లో సాధించిన తొలిప్రేమ సక్సెస్ తో పోల్చి చెప్పాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Tholi Prema: పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మొత్తం దేశమంతా ఓ సంచలనం. అక్కడి ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్నీ గెలిచిన రికార్డును అతడు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ విజయాన్ని అతడు తాను సినిమాల్లో సాధించిన తొలిప్రేమ సక్సెస్ తో పోల్చడం విశేషం.
అప్పుడు తొలిప్రేమ.. ఇప్పుడీ విజయం
పవన్ కల్యాణ్ కెరీర్లో తొలిప్రేమ ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ తొలినాళ్లలోనే ఈ సినిమా అందించిన విజయంతో అతని కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది. అంత వరకూ అందరూ చిరంజీవి తమ్ముడిగానే అతన్ని చూసినా.. తర్వాత పవర్ స్టార్ గా ఎదగడానికి కారణమైన సినిమా అది. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో తాను సాధించిన విజయాన్ని కూడా ఆ తొలిప్రేమ విజయంతో అతడు పోల్చాడు.
పిఠాపురంలో తాను విజయంతో సాధించడంతోపాటు జనసేన అభ్యర్థులు మొత్తం 21 స్థానాల్లోనూ గెలిచిన తర్వాత అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడాడు. "ఎన్నో ఏళ్లుగా నాకు విజయం లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాను. ఎన్నో సినిమాలు చేసిన తర్వాత కూడా నేను విజయం సాధించానని ఎవరూ చెప్పలేదు. నన్ను ఎన్నో మాటలన్నారు.
ఈరోజు కూడా నా పార్టీ ఇన్ని సీట్లు గెలిచిన తర్వాత కూడా నేను ఎంత విజయం సాధించానన్నది గుర్తించలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ల కిందట ఒకే ఒక్కసారి తొలిప్రేమ రూపంలో నేను విజయం సాధించాను. తర్వాత ఎన్నో సినిమాలు చేసినా, ఎంతో డబ్బు సంపాదించినా నేను గెలిచానని ఎవరూ చెప్పలేదు" అని పవన్ అనగానే అభిమానులు కేరింతలతో హోరెత్తించారు.
జనసేన 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్
జనసేన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ తో అదరగొట్టింది. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో జనసేనకు ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చింది. కానీ ఐదేళ్లలోనే రాజకీయాల్లోనూ పవన్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచే స్థాయికి తీసుకెళ్లింది.
పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం నుంచి 70 వేలకుపైగా ఓట్లతో గెలిచాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన పవన్.. ఏపీ టీడీపీ ప్రభుత్వంలో భాగం కాబోతున్నాడు. అతనికి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల్లో పవన్ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు సందేహంగా మారింది. పవన్ చివరిగా బ్రో మూవీలో కనిపించాడు.
ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది కాకుండా హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్‌ల రూపంలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇన్నాళ్లూ రాజకీయాల బిజీతో సినిమా షూటింగులకు దూరంగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో వెళ్లి ఈ సినిమాలను పూర్తి చేసి మళ్లీ రాజకీయాల్లోకి వస్తాడా అన్నది చూడాలి. ఈ రెండు సినిమాల తర్వాత అతడు మరిన్ని సినిమాలు చేస్తాడా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.