Jr NTR Vs TDP : జూ.ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ- ఎవరు ఎవరిని వదిలేశారు?-amaravati jr ntr dragged again in ap politics tdp leader buddha venkanna comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jr Ntr Vs Tdp : జూ.ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ- ఎవరు ఎవరిని వదిలేశారు?

Jr NTR Vs TDP : జూ.ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ- ఎవరు ఎవరిని వదిలేశారు?

HT Telugu Desk HT Telugu
May 25, 2024 03:57 PM IST

Jr NTR Vs TDP : ఏపీ రాజకీయాల్లో మరోసారి జూ.ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. టీడీపీతో జూ.ఎన్టీఆర్ కు సంబంధంలేదని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అనడంతో మరోసారి చర్చకు దారితీసింది.

 జూ.ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ- ఎవరిని ఎవరు వదిలేశారు?
జూ.ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ- ఎవరిని ఎవరు వదిలేశారు?

Jr NTR Vs TDP : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ చర్చ జరుగుతోంది. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంతో రాష్ట్రంలో మరోసారి చర్చకు దారితీసింది. అసలు టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ వదిలేశాడా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ వదిలేసిందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొంత కాలంగా టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ పెట్టారు. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. విస్తృతంగా బస్ యాత్ర చేపట్టారు. కోస్తాంధ్ర ప్రచారం ముగించుకుని తెలంగాణలోని అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రచారం ఖమ్మంలో ప్రమాదానికి గురవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ప్రచారం ముగిసిన చివరి రోజు కూడా ఆసుపత్రిలో బెడ్ మీద నుంచే మీడియాతో మాట్లాడి, టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.

అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారాన్ని చేపట్టారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమి‌ చెందిందని టీడీపీలో ఒక భాగం ప్రచారం ప్రారంభించాయి. అలాగే టీడీపీకి అనుబంధంగా ఉన్న ఒక పెద్ద వార్తా పత్రికలో మ్యాప్ వేసి మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి చెందిందని పెద్ద వార్త రాసేశారు.

పార్టీలో తండ్రిని నిర్లక్ష్యం చేయడంతోనే జూ. ఎన్టీఆర్ కు కోపం వచ్చిందా?

ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని వదలలేదు. పార్టీ మహానాడులో పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ఉత్తేజభరితమైన ప్రసంగం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం చేశారని, ఆయనను పట్టించుకోకపోవడంతో హరికృష్ణ ఆవేదనకు గురయ్యారని హరికృష్ణ సన్నిహితులు చెబుతుంటారు. టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాన్ని, చంద్రబాబు తీరును హరికృష్ణ తన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు చెప్పి మనోవేదనకు గురయ్యారని చెబుతుంటారు. తండ్రికి జరిగిన అవమానం పట్ల కోపోద్రిక్తులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని భోగట్టు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చించివేయించిన బాలకృష్ణ

ఇటీవలి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని టీడీపీ నేత, జూనియర్ ఎన్టీఆర్ చిన్నాన్న నందమూరి బాలకృష్ణ ఆదేశించడంతో రాష్ట్రంలో రగడ జరిగింది. బాలకృష్ణ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిబట్టీ నందమూరి ఫ్యామిలీ హరికృష్ణ కుటుంబాన్ని పక్కన పెట్టారని స్పష్టం అవుతుంది. టీడీపీ నేత లోకేశ్ కోసం తండ్రి చంద్రబాబు నాయుడు, మామ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనపెట్టారని సర్వత్రా చర్చ జరిగింది.

టీడీపీకి దూరమైన జూనియర్ ఎన్టీఆర్

2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్, 2014, 2019, 2024 ఎన్నికల్లోనూ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. తాను పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా..తాను సిద్ధంగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లోనే స్పష్టంగా చెప్పారు. కానీ గత మూడు ఎన్నికల్లో ప్రచారం చేయకపోడం, రాజమహేంద్రవరంలో జరిగి‌న టీడీపీ మహానాడు, టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ ప్రచారానికి పిలవలేదా? ఒకవేళ పార్టీ పిలిచినా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లలేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ నేతలు విమర్శలు

టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్ ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ ను నేరుగా విమర్శింకపోయినా, అదును చూసి టీడీపీ నేతలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శల దాడి చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న వారిని చంద్రబాబు, లోకేశ్ మందలించడంలేదు. దీంతో వారు జూనియర్ ఎన్టీఆర్ పై పదేపదే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ ప్రోద్బలంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని చర్చ కూడా ఉంది. అయితే వీటిపై జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించలేదు. కాగా ఆయనకు సన్నిహితులుగా ఉన్న వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మాత్రం టీడీపీ నేతలకు కౌంటర్ ఇస్తువస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుపై ఎందుకు స్పందించలేదు?

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల విషయంలో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడలేదనే వాదన ఉంది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీటి పర్యంతం...హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు, చంద్రబాబు అరెస్టు సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ ముఖ్యులకు నచ్చలేదు. వీటిలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చాలా సున్నితంగా వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదని స్పందించారు. అంతేతప్ప బలమైన విమర్శలు చేయలేదు. అప్పట్లోనే టీడీపీ నేత బుద్దా వెంకన్న ఓపెన్ గానే జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. అదే సమయంలో కొడాలి నాని లాంటి వారు జూ.ఎన్టీఆర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.

బుద్దా కామెంట్స్ పై అభిమానులు ఆగ్రహం

ఇప్పుడు బుద్దా వెంకన్న మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలనానికి కారణమయ్యారు. 2009 తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ పార్టీ ప్రచారానికి కూడా రాలేదని అన్నారు. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యల పైన తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలపై బిజీగా తారక్

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా ఎదిగాడు. ఇటువంటి తరుణంలో రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రస్తుతం తారక్ భావించడం లేదని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో ఏ కామెంట్స్ చేసినా వివాదాలకు దారితీస్తుందని, అలా కాకుండా మౌనంగా ఉండటమే ఉత్తమమని జూనియర్ భావించే దూరంగా ఉంటున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం