తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Facial Recognition Attendance For Andhra Pradesh Government Employees From Today

Facial Recognition In AP : ఉద్యోగుల హాజరులో నేటి నుంచి కొత్త రూల్స్….

B.S.Chandra HT Telugu

02 January 2023, 6:18 IST

    • Facial Recognition In AP ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల హాజరు నమోదులో నేటి నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. నిన్న మొన్నటి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ అమల్లో ఉన్న కొత్త ఏడాది అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను పక్కాగా అమలు చేయనున్నారు. మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలు, బాధ్యతలు, తీసుకునే జీతం వంటి సమాచారాన్ని బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. 
ఏపీలో నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌
ఏపీలో నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌

ఏపీలో నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌

Facial Recognition In AP ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాది కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. ఉద్యోగులు ఇకపై తమ హాజరును ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల్లోను అమలు చేయనున్నారు. మరోవైపు అటెండెన్స్‌పై ప్రభుత్వ నిబంధనలపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జనవరి 2వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌ తప్పనిసరి చేశారుు. ఉద్యోగులు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని అటెండెన్స్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులతో పాటు డీడీఓలకు యాప్‌ వినియోగంపై మార్గదర్శాలు ఇప్పటికే జారీ చేశారు. ఏపీసిఎఫ్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌, గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌ లోడ్ చేసుకుని వినియోగించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డిని ఏపీ రెవిన్యూ సర్వీసెస్‌, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతల కోరారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపుల జాప్యం జరుగుతుండటం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని సీఎస్ దృష్టికి తీసుకువెళ్లారు. గత రెండేళ్లుగా జీపిఎఫ్‌ రుణాలు, రిటైర్డ్‌ సిబ్బందికి అందాల్సిన ప్రయోజనాలు, మెడికల్ రియింబర్స్‌మెంట్‌ వంటివి సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చీఫ్‌ సెక్రటరీకి వివరించారు.

మరోవైపు హాజరు నమోదులో ఆలశ్యమైతే జీతం కట్ చేస్తారనే వార్తలపై కూడా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లిస్తారంటూ వస్తున్న వార్తల్లో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఫీల్డ్‌ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగి ఆందోళన చెందుతున్నారని వారికి టార్గెట్లు పెట్టి, జీతాల్లో కోతలు విధిస్తున్నారని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని వాటిని ఆపాలని కోరారు.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద బోర్డులు….

ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో జవాబుదారీతనం కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, వారి విధులు, వారికి ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలతో కూడిన బోర్డుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయా కార్యాలయాల్లో ఎవరెంత జీతం తీసుకుంటున్నారో కూడా బోర్డులపై వెల్లడించనుంది. ఈ నిర్ణయంపై కసరత్తు చేస్తుండటంతో ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఉద్యోగల వేతన సమాచారం బహిరంగంగా ప్రదర్శించాలనే నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యోగుల వేతన వివరాలను బహిరంగం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. ఉద్యోగుల్లో ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని సంఘాలు ఆరోపిస్తున్నాయి.

జవాబుదారీతనం, సమాచార హక్కు చట్టం పేరుతో ప్రభుత్వం ఉద్యోగుల వివరాలను బయటపెట్టే ప్రయత్నం చేయడాన్ని తప్పు పడుతున్నారు. ఇప్పటి వరకు రెవిన్యూ కార్యాలయాలు, ఆస్పత్రులలో మాత్రమే సమాచార హక్కు చట్టానికి సంబంధించిన నోడల్ అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచేవారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి బోర్డులు ఎక్కడా ఉండేవి కాదు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరు, వారి విధులు, వేతనమెంత? అనే వివరాలను కూడా బహిర్గతం చేయాలని నిర్ణయించారు. త్వరలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఈ వివరాలను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు యోచిస్తోంది.