తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Employees Benefits: ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందేనా..? ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు...

AP Employees Benefits: ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందేనా..? ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు...

Sarath chandra.B HT Telugu

25 February 2024, 5:00 IST

google News
    • AP Employees Benefits: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త గుబులు పట్టుకుంది. పదవీ విరమణ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందుతాయో లేదోననే ఆందోళనలో ఉద్యోగులు సతమతం అవుతున్నారు.
ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ (ఫైల్)
ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ (ఫైల్)

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ (ఫైల్)

AP Employees Benefits: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగుల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రయోజనాలపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు State Govt Employees ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై స్పష్టత కొరవడంతో అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగల సంఘాలతో జరిపిన చర్చల్లో కూడా దీనిపై స్పష్టత రాకపోవడంపై నిరసన వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే అదనపు కాలంతో కలిపి సర్వీస్‌ పూర్తి చేసుకున్న వేలాది మంది జనవరి 31 నుంచి రిటైర్ అవుతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్ధిక ప్రయోజనాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలీని పరిస్థితి నెలకొంది.

ఏపీలో దాదాపు నాలుగున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరు కాకుండా కార్పొరేషన్లు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, యూనివర్శిటీలు, విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు Employees మరో మూడు లక్షల వరకు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ల క్రితం రెండేళ్ళ సర్వీసును పొడిగించింది. అప్పటికే 60ఏళ్లుగా ఉన్న రిటైర్మెంట్ వయసును 62ఏళ్లకు పొడిగించారు. దీంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు సర్వీసులో కొనసాగారు. కొంతమంది మరో రెండేళ్లు సర్వీసు లభించినందుకు సంతోషించారు. రెండేళ్లుగా ఉద్యోగులకు వేతనాల రూపేణ అదనపు ప్రయోజనం దక్కినట్టేనని ప్రభుత్వ వాదనగా ఉంది.

ఉద్యోగుల సర్వీసు పొడిగింపు వెనుక రకరకాల వాదనలు వినిపించాయి. ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలు చెల్లించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేకపోవడంతోనే పదవీ విరమణ వయసును పొడిగించినట్లు ప్రచారం జరిగింది. ప్రభుత్వం రెండేళ్ల సర్వీసు పొడిగింపు కూడా గత జనవరితో పూర్తై పోయింది. 2024 జనవరి 31 నుంచి 62ఏళ్ల వయసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ సమయంలో వారికి గ్రాట్యుటీ, జిపిఎఫ్‌, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌, ఏపీజిఎల్‌ఐ వంటి ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉద్యోగి రిటైర్‌ అయిన రోజే ఆర్ధిక ప్రయోజనాలను చేతుల్లో పెట్టి సాగనంపే వారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రక్రియ క్రమం ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో రెండు మూడు నెలలకైనా అన్ని దశల్లో ఫైల్స్‌ క్లియర్ అయ్యి ఉద్యోగులకు నగదు ప్రయోజనాలు అందేవి.

రెండేళ్ల క్రితం ఉద్యోగులకు పదవీ విరమణ పొడిగించిన సమయంలో చాలామంది స్వచ్ఛంధ పదవి విరమణకు మొగ్గు చూపారు. అలాంటి వారిలో కొందరికి మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలు దక్కాయి. స్వచ్ఛంధ పదవీ విరహన చేసినా పొడిగించిన సర్వీసు కాలం ముగిసిన తర్వాత మాత్రమే ఆర్ధిక ప్రయోజనాలు చెల్లిస్తామని తేల్చి చెప్పడంతో చాలామంది సర్వీసు కొనసాగించారు.ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనులు చక్కబెట్టుకోగలిగిన వారికి మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ దక్కాయి. ఉద్యోగుల పదవీ విరమణ మొదలై రెండో నెలకు చేరడంతో రిటైర్ అయ్యే ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో అలజడి మొదలైంది.

ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని స్పష్టత కోరుతున్న ఎన్నికలు పూర్తయ్యే వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు పెన్షన్‌ మాత్రమే ఫిక్స్ చేస్తున్నారని, రిటైర్మెంట్‌ తర్వాత చెల్లించాల్సిన నగదు ప్రయోజనాలు ఎప్పట్లాగో చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

నిర్ధిష్ట కాల వ్యవధిలో వడ్డీతో చెల్లించే ప్రతిపాదనలు చేస్తున్నారని ఓ సంఘం నాయకుడు వివరించారు. ప్రస్తుతం ఉద్యోగులకు భారీ ఎత్తున చెల్లింపులకు తగిన ఆర్ధిక వనరులు లేనందున బాండ్ల రూపంలో చెల్లించే అవకాశాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు.

ఉద్యోగ విరమణ డబ్బులతో రిటైర్మెంట్‌ జీవితాన్ని పదిలం చేసుకుందామనుకునే వారికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లల పెళ్లిళ్లు, ఆరోగ్యం, వైద్య చికిత్సలు, ఉన్నత విద్య వంటి ఖర్చుల కోసం చేతికి డబ్బులు అందే పరిస్థితులు లేవని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి నిర్దిష్ట హామీ, ప్రకటన కూడా వెలువడటం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం