AP Govt Employees : ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ, చర్చలు సఫలం కాలేదంటున్న ప్రతినిధులు
AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏల చెల్లింపులపై ఈ భేటీలో చర్చించారు. ఈ చర్చలు అంత ప్రతిఫలం ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
AP Govt Employees : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు(AP Govt Employees)మరోసారి తమ గళం విప్పారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరిపారు. మొత్తం 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఉద్యోగాలు ప్రధాన డిమాండ్లు పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏల చెల్లింపులపై ఈ భేటీలో చర్చించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడ(Vijayawada)కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చర్చల సఫలం కాలేదు-బొప్పరాజు
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు సఫలం కాలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీని నియమించినప్పుడు మధ్యంతర భృతి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, గత పీఆర్సీ(PRC) అరియర్ లు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులపై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. పీఆర్సీ అరియర్ లు రూ.14,800 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో చెప్పారని, దీనిపై స్పష్టత రాలేదన్నారు. మధ్యంతర భృతి ప్రకటనకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం రివర్సు పీఆర్సీ ఇచ్చిందన్నారు. 12వ పీఆర్సీని జులై 31 లోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. అందుకే మధ్యంతర భృతి ప్రకటించడం లేదని చెప్పారని తెలిపారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్(Pension) పై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందని బొప్పరాజు ఆరోపించారు.10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే రెగ్యులర్ చేశారన్నారు.
ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం
అయితే ఈ సమావేశానికి ముందు ఉద్యోగులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించాలని మంత్రి బొత్సకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఈ సమయంలో ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రి బొత్సను సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిగా, ఉద్యోగులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌కు, బకాయిల చెల్లింపునకు సంబంధం ఏంటని చిర్రుబుర్రులాడారు.
గత సమావేశంలో
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.20 వేల కోట్ల వరకు ఉంటుందని తేల్చారు. వీటిలో రూ.5,500 కోట్లను ఈ నెలాఖరు, లేదా మార్చి 31 నాటికి చెల్లిస్తామని గత సమావేశంలో మంత్రులు ప్రకటించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను వెల్లడించింది. వీటిని ఇప్పటికిప్పుడు పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని తేల్చేసింది. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న మధ్యంతర భృతి మాత్రం సీఎం జగన్‌తో చర్చించి చెబుతామని మంత్రుల కమిటీ గత సమావేశంలో ప్రకటించింది. 2023 కన్నా ముందు నియామకం పొందిన వారికి కూడా ఓపీఎస్ వర్తింప చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం