Bopparaju Venkateswarlu :ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలపై ఉత్తర్వులు వచ్చినా చెల్లింపులు లేవు- బొప్పరాజు వెంకటేశ్వర్లు
Bopparaju Venkateswarlu : సీఎం హామీలే అమలు కాకపోతే ప్రభుత్వంపై నమ్మకం పోతుందని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పిల్లలు చదువులు, వివాహాలకు దాచుకున్న డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు.
Bopparaju Venkateswarlu : పిల్లల చదువులు, వివాహాల కోసం దాచుకున్న డబ్బులు కూడా చెల్లించకపోతే ఉద్యోగులు ఏం చేయాలని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఉద్యోగ సంఘం నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. డీఏ, సరెండర్ లీవ్ లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఉద్యోగ విరమణ బకాయిలు చెల్లించకపోతే ఉద్యోగులు, పింఛన్ దారులు ఎలా బతకాలని సీఎస్ ను కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవటం సరికాదని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటేనే పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం హామీలే అమలు కాకపోతే ఎలా
సీఎం హామీలే అమలు కాకపోతే ప్రభుత్వంపై నమ్మకం పోతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ నేటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. జిల్లా పరిషత్‌ల పరిధిలో ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు అమలు కావటం లేదన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించి నెలలు గడుస్తున్నా కమిషన్ ఛైర్మన్‌కు సీటు కేటాయించలేదని, సిబ్బంది కేటాయింపు జరగలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.