AP Employees salaries: ఏపీలో మూడో వంతు ఉద్యోగులకు ఇంకా జీతాల్లేవు-one third of the employees in ap are worried about not getting their salaries ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Employees Salaries: ఏపీలో మూడో వంతు ఉద్యోగులకు ఇంకా జీతాల్లేవు

AP Employees salaries: ఏపీలో మూడో వంతు ఉద్యోగులకు ఇంకా జీతాల్లేవు

Sarath chandra.B HT Telugu
Dec 12, 2023 09:12 AM IST

AP Employees salaries: ఆంధ్రప్రదేశ్‌లో మూడో వంతు ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ రెండో వారానికి కూడా వేతనాలు అందలేదు. నవంబర్ వేతన చెల్లింపులతో పోలిస్తే కొందరికే వేతన చెల్లింపులు జరగడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

వేతనాల కోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగులు
వేతనాల కోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగులు (HT_PRINT)

AP Employees salaries: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ రెండో వారానికి కూడా పూర్తి స్థాయిలో వేతనాలు అందలేదు. నవంబర్ నెల వేతనాల చెల్లింపుతో పోలిస్తే మూడో వంతు ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. నవంబర్‌‌లో దాదాపు రూ.4వేల కోట్ల రుపాయలు వేతనాల కోసం చెల్లిస్తే డిసెంబర్‌ రెండోవారానికి రూ.2700కోట్ల మాత్రమే చెల్లించారు. మరో రూ.1300కోట్ల రుపాయల వేతనాలు చెల్లించాల్సి ఉంది.

ఏపీలో గత కొద్ది నెలలుగా ఉద్యోగుల వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను, ఉద్యోగుల వేతనాల చెల్లింపును బ్యాలన్స్ చేయడానిక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రతి నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపుతో పాటు సంక్షేమ పథకాలకు నిధులు సమీకరించడానిక రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది.

డిసెంబర్‌ నెల రెండో వారానికి కూడా చాలా మందికి వేతనాలు అందలేదు. వీరిలో ప్రధానంగా ఉపాధ్యాయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో దాదాపు 13లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, యూనివర్శిటీలలో పనిచేసే వారు ఉన్నారు. వేతన చెల్లింపుల విషయంలో చిన్న వేతనాల వారికి మొదటి ప్రాధాన్యతలో చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి వేతనాలు అందినా ఇంకా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు వేతనాలు సోమవారం నాటికి కూడా జమ కాలేదు.

రిజర్వుబ్యాంకు గత మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రూ.3,000 కోట్ల వరకు అప్పు తీసుకోవడంతో జీతాలు, పెన్షన్లు డిసెంబర్ మొదటి వారంలో ఇస్తారని చాలా మంది ఆశించారు. ఆర్బీఐ నుంచి తెచ్చిన నిధులను ఇతరత్రా అవసరాలకు వాడేయడంతో ఉద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి.

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఆ నిధులు బుధవారానికి ఖజానాకు చేరతాయి. మంగళవారం తీసుకునే రుణాన్ని ఏ అవసరాలకు వినియోగిస్తారనే దానిపై ఉద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నవంబరు నెలలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.1,800 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి.

గత మూడు నెలలుగా ఉద్యోగులకు సగటున ప్రతి నెలా రూ.4,000 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు జీతాల కింద చెల్లిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికి రూ.2,700 కోట్లు మాత్రమే జీతాలకు చెల్లించారు. పెన్షన్ల కోసం రూ.1,800 కోట్ల వరకు ప్రతి నెలా చెల్లిస్తున్నారు. ఈ నెల ఇంతవరకు రూ.1,500 కోట్ల మేర చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా సుమారు రూ.250 కోట్ల వరకు చెల్లించాలి. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ జీతాలు రూ.70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.

ఈ ఏడాది ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం రూ.46వేల కోట్ల రుపాయల వ్యయాన్ని అంచనా వేశారు. పెన్షన్ల కోసం 21వేల కోట్లను కేటాయించారు. నవంబర్‌లో పెన్షన్ల కోసం రూ.1800కోట్లను విడుదల చేయగా డిసెంబర్‌ రూ.1400కోట్లను మాత్రమే విడుదల చేశారు.

Whats_app_banner