Ap Govt On State Debts: టీడీపీ హయంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తక్కువేనన్న దువ్వూరి కృష్ణ-the ap government claims that the state government debt is less compared to the tdp regime ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt On State Debts: టీడీపీ హయంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తక్కువేనన్న దువ్వూరి కృష్ణ

Ap Govt On State Debts: టీడీపీ హయంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తక్కువేనన్న దువ్వూరి కృష్ణ

HT Telugu Desk HT Telugu
May 11, 2023 11:55 AM IST

Ap Govt On State Debts: తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన తక్కువేనని, టీడీపీ చేసిన అప్పులకు కూడా వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆరోపించారు.

దువ్వూరి కృష్ణ, ఏపీ సిఎం కార్యదర్శి
దువ్వూరి కృష్ణ, ఏపీ సిఎం కార్యదర్శి

Ap Govt On State Debts: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి గురించి దురుద్దేశాలతో కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని, ఎవరికి పరిచయం లేని వ్యక్తితో ఇంటర్వ్యూలు ఇప్పించి, ఆర్ధిక వేత్తగా, ఆర్ధిక నిపుణుడిగా ప్రచారం చేస్తున్నారని దువ్వూరి కృష్ణ ఆరోపించారు.సత్య దూరమైన విశ్లేషణలతో అభ్యంతరకరమైన ప్రకటనలు ఇప్పించి ప్రజల్లో భయోత్పాతం కల్పించే ప్రచారం జరుగుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఖచ్చితమైన గణంకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంచుతున్నామని స్పష్టం చేశారు.

ఉచిత పథకాలను వృధా ఖర్చులుగా విశ్లేషించడాన్ని తప్పు పట్టారు. విద్యా, వైద్య రంగాలపై చేస్తున్న ఖర్చును ఉచిత పథకాలుగా విశ్లేషించడాన్ని తప్పు పట్టారు. ఎన్నికల కోసం రూ.5వేల కోట్లు అప్పు చేసి వాటిని ప్రజలకు పంచితే వాటిని ఎన్నికల స్టంట్లుగా భావించాలన్నారు.

పబ్లిక్ ఫైనాన్స్ గురించి సామాన్య ప్రజలకు అవగాహన ఉండదని, ప్రభుత్వాలతో పనిచేసిన అనుభవం ఉంటే తప్ప మిగిలిన వారికి దానిపై అవగాహన ఉండదని చెప్పారు. అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించి, రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని వివరించే ప్రయత్నం చేసి ఉంటే తాము కూడా స్వాగతించి ఉండేవారిమని, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, శ్రీలంక మాదిరి అవుతోందని ప్రకటన చేయడంపై అభ్యంతరం తెలిపారు.

విపక్షాల విశ్లేషణల్లో వాస్తవాలు ఉంటే తాము కూడా స్వాగతిస్తామని, అవేమి లేకుండా ప్రభుత్వం మీద బురద చల్లడమే ధ్యేయంగా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అప్పు ఎంత అనే దానిపై విపరీతమైన దుష్ప్రచారం జరుగుతోందని కృష్ణ ఆరోపించారు.

విభజన నాటి అప్పులు…

రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,18,050 కోట్ల అప్పు ఉందని, 2019 మే 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ. 3.31 లక్షల కోట్ల అప్పులు చేరాయని తెలిపారు. 2023 మార్చి 3 నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.4.42లక్షల కోట్లకు చేరాయని వివరించారు.

ప్రభుత్వ గ్యారంటీతో జరుగుతున్న అప్పులపై చాలా చర్చ జరుగుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ అవసరాల కోసం అప్పులు తీసుకోడానికి, పూచీకత్తు ఇచ్చి ఆర్ధిక అవసరాలు తీర్చుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని చెప్పారు.

ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం ఏ జీవోల ప్రకారం, ఏ సంస్థకు ఎంత అప్పు తీసుకుందో కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా ఈ తరహా అప్పులు ప్రభుత్వాలు చేశాయని, ఇప్పుడు మాత్రమే వాటిని తప్పు పడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీల ద్వారా తీసుకున్న అప్పులు 2014లో రాష్ట్రం కొత్తగా మొదలైనపుడు రూ.14,228కోట్ల అప్పు ఉందని, మే 2019 నాటికి అది రూ. 59,257కోట్ల అప్పు ఉందని చెప్పారు. మార్చి 2023నాటికి 1,44,875కోట్లకు చేరిందని చెప్పారు. గ్యారంటీల ద్వారా చేసిన అప్పుల్లో రూ.45వేల కోట్ల వరకు విద్యుత్‌ రంగంలోనే ఉన్నాయని చెప్పారు. వాటిని విద్యుత్ రంగమే తీరుస్తుందని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రూ.5.87లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. గ్యారంటీలు ఇవ్వకుండా ప్రభుత్వ సంస్థ చేసిన అప్పలు గురించి మాట్లాడుతున్నారని, సొంతంగా అప్పులు చేయగలిగిన వ్యవస్థ కేవలం విద్యుత్ రంగానికి మాత్రమే ఉందని వివరించారు.

విద్యుత్ సంస్థల్లో విభజన నాటికి రూ.18,374 కోట్ల అప్పు ఉందని, అది 2019 మే నాటికి విద్యుత్ సంస్థలు రూ.59,692 కోట్లకు చేరుకున్నాయని, ఆ అప్పులు ఈ ఏడాది మార్చి నాటి రూ .56వేల కోట్లకు అప్పులు తగ్గాయని చెప్పారు.

విద్యుత్ ఉత్పత్తిదారులకు పంపిణీ సంస్థలు ఇవ్వాల్సిన అప్పులు 2019లో రూ.2,809కోట్లు ఉంటే, 2019నాటికి రూ.21,540కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం అవి రూ.8వేల కోట్లకు చేరాయన్నారు.

ప్రభుత్వం చేసిన అప్పులు, గ్యారంటీలతో చేసిన అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ.1,53,46 కోట్లు ఉందని 2019 మేలో టీడీపీ ప్రభుత్వం ముగిసే నాటికి అన్ని రకాల అప్పులు కలిసి రూ.4,12,288కోట్లకు చేరాయన్నారు. మార్చి 2023 నాటికిరాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6,61,789 కోట్లు ఉన్నాయని వివరించారు.

అప్పుల పెరుగుదల టీడీపీ హయంతో పోలిస్తే ఎక్కువ లేదన్నారు.సిఏజిఆర్‌ టీడీపీ హయంలో 21.87 శాతం ఉంటే ప్రస్తుతం 12.69మాత్రమే ఉందన్నారు.

విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పుల్లో లక్షన్నర కోట్ల అప్పుకు రూ.12-13 వేల కోట్లకు మించి వడ్డీ లేదని, టీడీపీహయంలో చేసిన అప్పులతో కలిపి ఏటా రూ.33-34వేలకోట్ల రుపాయలు వడ్డీకి చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి గురించి ఊరుపేరు లేని వ్యక్తులతో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గ్యారంటీలతో చేసిన అప్పులు, నాన్ గ్యారంటీ అప్పుల్లో స్పష్టమైన లెక్కలు ఉన్నా ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసేస్తోందని విమర్శిస్తున్నారని కృష్ణ ఆరోపించారు.

సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజలకు ఎక్కువ మేలు జరిగిందని, వాటిని వక్రీకరించి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అపోహలు కల్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

Whats_app_banner