AP Employees fight: ఎన్నికల సీజన్ మొదలు.. మళ్లీ గొంతు విప్పుతోన్న ఉద్యోగ సంఘాలు..
AP Employees fight: ఏపీలో ఎన్నికల కోలాహలంతో పాటు ఉద్యోగ సంఘాల హడావుడి మొదలైంది. దాదాపు ఏడెనిమిది నెలలుగా స్తబ్దుగా ఉన్న ఉద్యోగ సంఘాలు గొంతు సవరించుకుని పోరాటాలకు సిద్ధం అవుతున్నాయి.
AP Employees fight: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడితో పాటే ఉద్యోగ సంఘాలు కూడా మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు వ్యూహాత్మక మౌనం పాటించిన ఉద్యోగ సంఘాలు అదను కోసం ఎదురు చూస్తూ వచ్చాయి. ఎలక్షన్ టైమ్ దగ్గర పడటంతో తమ ఆయుధాలకు పదును పెడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొద్ది నెలలుగా సైలెంట్ అయిపోయాయి. దీనికి కారణం ఏమిటనేది ఎవరికి అంతు చిక్కలేదు. ఉద్యోగ సంఘాల లోటుపాట్లన్ని ప్రభుత్వం గుప్పిట్లో ఉండటంతో అన్ని సంఘాలు ఓ దశలో బెదిరిపోయాయి. ఓ సంఘం నాయకుడు ఏకంగా పోలీసుల నుంచి తప్పించుకోడానికి నెలల తరబడి ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది.
ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున సదరు నాయకుడు గండి కొట్టిన వ్యవహారం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూడటంతో చాన్నాళ్లు పత్తా లేకుండా పోయాడు. శాఖాధిపతుల్ని శాసించిన నాయకుడు చివరకు కాళ్లబేరానికి రావాల్సిన పరిస్థితి చూసిన మిగిలిన సంఘాలు కూడా వెనక్కి తగ్గాయి. ప్రభుత్వంతో గొడవ పడితే ఏమి జరుగుతుందో తెలిసిపోయాక ఉద్యోగ సంఘాలన్నీ సైలెంట్ అయిపోయాయి.
ఎలక్షన్ టైమ్ రావడంతో మళ్లీ యాక్టివ్….
ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఉద్యోగ సంఘాలు Employees Assns ఒక్కసారిగా యాక్టివేట్ అవుతున్నాయి. మళ్లీ ఉద్యమాలకు సిద్ధమని ప్రకటిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండాల్సిన పని ఉద్యోగులకు ఉండదు. కేవలం ఎలక్షన్ కమిషన్‌కు మాత్రమే లోబడి ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది.
ఎటూ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తున్నందున వీలైనంత త్వరగా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోక పోవడంతో గుర్రుగా ఉన్న సంఘాలన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని యోచిస్తున్నాయి.
ఇందుకోసం ఈ నెల14 నుండి ఉద్యమానికి సిద్ధమని ప్రకటించాయి. ఫిబ్రవరి 27న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. సోమవారం మంత్రుల బృందం GOMతో జరిగే భేటీ సఫలం కాకుంటే ప్రత్యక్ష పోరాటమేనని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా వీలైనన్ని తాయిలాలు ప్రకటించకపోతుందా అనే ఆశలు ఉద్యోగ సంఘాల్లో ఉన్నాయి.
రెండేళ్ల క్రితం అన్ని శాఖలకు చెందిన APJAC ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. విజయవాడలో వేల సంఖ్యలో ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. రోజంతా నిరసనలతో హోరెత్తించారు. అయినా వాళ్ల పెద్దగా డిమాండ్లను సాధించుకోలేక పోయారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పాలక పక్షంపై విపక్షాలతో ఒత్తిడి పెంచాలని యోచిస్తున్నాయి.
సోమవారం మంత్రుల బృందం తో జరిగే చర్చలు విఫలం అయితే ఈ నెల 14న ఉద్యోగుల ఉద్యమ బాట పడతాయని 27 తేదీ చలో విజయవాడ చేపట్టి ఉద్యోగుల సత్తా నిరూపిస్తామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు.
ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి హక్కుగా వివిధ పద్దుల కింద రావలసిన బకాయిల జాబితాను ప్రకటించారు. 12వ పిఆర్సిలో మధ్యంతర భృతి 30% చెల్లింపు, పెండింగ్ లో ఉన్న రెండు డీఏల సొమ్ములు, సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎలను 90శాతం నగదు రూపంలో చెల్లించడం, పిఎఫ్, ఏపీ జిఎల్‌ఐ రుణాలు, క్లైములు, 11వ పిఆర్సి లో చెల్లించాల్సిన సరెండర్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్, మెడికల్ రీయంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
వీటితో పాటు 1-9-2004 ముందు నోటిఫై అయిన తర్వాత నియామక ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఇహెచ్ఎస్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మంజూరు చేయటం, ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానాన్ని అమలు చేసేలా విడుదలైన జీవో 117 ను రద్దు చేయటం ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు.
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్, రోజువారి జీతం, పార్ట్ టైం, ఫుల్ టైం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించటం, ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేయటం, గురుకులాలు, సొసైటీ, పబ్లిక్ సెక్టార్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంపు వంటి అంశాలతో కూడిన తమ డిమాండ్ లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందజేస్తామన్నారు.
సోమవారం మంత్రుల బృందంతో చర్చించేందుకు ఉద్యోగ సంఘ నాయకులు రావాలని ప్రభుత్వం ఆహ్వానించినందున వారితో కూడా తమ డిమాండ్లపై చర్చించనున్నట్లు వివరించారు. చర్చల అనంతరం ప్రభుత్వ స్పందన బట్టి 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావడం, తహసిల్దారు, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనున్నారు.
15, 16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తాలూకా కేంద్రాలు, పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు, 17వ తేదీన తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నా చేపట్టడం, 20వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహణ, 21 నుంచి 24 వరకు రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాల్లో పర్యటించి 27వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడకు ఉద్యోగులను సిద్ధం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
ముందే సిద్ధమైన సర్కారు…
ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల వైఖరిపై ముందే స్పష్టమైన అవగాహనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా హామీలను ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలుతో తీవ్ర ఆర్ధిక ఇక్కట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు భారీగా ఖర్చు చేయాల్సి రావడం భారంగా పరిణమించింది.