AP Govt Employees: అంతుచిక్కని ఉద్యోగుల అంతరంగం… ఎన్నికల వేళ కొత్త చర్చ-strategic silence of government employees disturbing major parties ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees: అంతుచిక్కని ఉద్యోగుల అంతరంగం… ఎన్నికల వేళ కొత్త చర్చ

AP Govt Employees: అంతుచిక్కని ఉద్యోగుల అంతరంగం… ఎన్నికల వేళ కొత్త చర్చ

Sarath chandra.B HT Telugu
Jan 26, 2024 09:11 AM IST

AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో అనూహ్యంగా వచ్చిన ఓ మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అంతుచిక్కని ప్రభుత్వ ఉద్యోగుల అంతరంగం
అంతుచిక్కని ప్రభుత్వ ఉద్యోగుల అంతరంగం

AP Govt Employees: ఉద్యమాలు లేవు.. వార్నింగులు లేవు… సీపీఎస్‌ వ్యతిరేక పోరాటాలు లేవు, పిఆర్సీ డిమాండ్లు లేవు, డిఏల కోసం ధర్నాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌‌లో నిన్న మొన్నటి వరకు చిటపటలాడిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. అనూహ్యంగా వచ్చిన ఈ మార్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలన్నీ దారికొచ్చేసినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ముందు కోర్కెల చిట్టా విప్పడం లేదు. డిమాండ్ల కోసం గేట్‌ మీటింగులు, ధర్నాలు చేయడం లేదు. ఉద్యమ బాట పడతామనే వార్నింగులు కూడా ఇవ్వడం లేదు. ఎందుకిలా ఉద్యోగ సంఘాలు సైలెంట్ అయ్యాయనే సందేహం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రధానంగా వైసీపీ అధ్యక్షుడు ఇచ్చిన హామీ మేరకు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా ఓల్డ్‌ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యమించారు.

దీంతో పాటు వేతన సవరణ, డిఏలు చెల్లింపు, పాత బకాయిలు విడుదల వంటి డిమాండ్లతో దశల వారీగా ఉద్యమించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవిన్యూ ఉద్యోగ సంఘాలు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా, ఉమ్మడిగా రకరకాల ఉద్యమాలు చేశాయి. 2022లో చేపట్టిన చలో విజయవాడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు మొదలుకుని, కోవిడ్‌ కాలంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఉద్యోగాలు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌, ఉద్యోగులు భవిష్య నిధిలో దాచుకున్న డబ్బుల విడుదల, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సెటిల్మెంట్ వంటి సమస్యలపై కూడా రకరకాల పోరాటాలు చేశారు. ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. సీపీఎస్ రద్దు కాస్త గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ప్రతిపాదనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ గత ఆరేడు నెలలుగా తమ ఆందోళనలు పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఎవరు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఉద్యోగుల్లో ఆకస్మికంగా వచ్చిన మార్పు వెనుక కారణాలు ఏమిటని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతున్నారు.

పోరాటాలు వృధా అనుకునే…

గతంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఉద్యోగుల సంఘాలు తమ డిమాండ్లను నెగ్గించుకునేవి. భారీగా డిమాండ్లను పెట్టి అందులో మూడో వంతైనా దక్కించుకునేవి. వేతన సవరణ మొదలుకుని ఇతర డిమాండ్ల విషయంలో ఇదే రకమైన వ్యూ‍హాన్ని అమలు చేసేవి

గత నాలుగున్నరేళ్లలో ఉద్యోగుల సంఘాలు చేసిన ఏ పోరాటాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని భావిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్ధిక అంశాల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం కనిపించక పోవడంతో అవి పునరాలోచనలో పడ్డాయి. దీంతో పాటు ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన ఉద్యోగ సంఘాలకు రకరకాల చిక్కులు ఎదురు కావడంతో ప్రధాన సంఘాల నాయకులు కూడా మెత్తబడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం వేతన చెల్లింపుల మీద గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ నెలల తరబడి పోలీసుల నుంచి తప్పించుకోడానికి తిప్పలు పడాల్సి వచ్చింది. ఉద్యోగ సంఘం నాయకుడి హోదాలో కమర్షియల్ టాక్స్‌ విభాగంలో ఆయన చేసిన ఘనకార్యాలు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూడటంతో మిగిలిన వాళ్లు అలర్ట్ అయ్యారు.

వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన వందల కోట్ల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడం పలువురు ఉద్యోగులు జైలు పాలైన తర్వాత మిగిలిన సంఘాల నాయకులు బెదిరి పోయారు.ఇక సచివాలయంలో సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ స్థాయిలో సెక్షన్ ఆఫీసర్ల బదిలీలు పెద్ద ఎత్తున జరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్దేశం ఉద్యోగులకు స్పష్టం కావడంతో మిగిలిన వారు జారిపోయారు.

ఎన్నికల్లో తేల్చుకుందామనే…

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంతో తేల్చుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలో దాదాపు 13లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నాలుగున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పొరేషన్లు, ఉపాధ్యాయులు, యూనివర్శిటీలు, పెన్షనర్లను కలుపుకుంటే 13లక్షల మందికి పైగా ప్రభుత్వ వేతనాలు అందుకుంటారని చెబుతున్నారు.

ఒక్కో ఉద్యోగి కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటారని లెక్కేసుకున్న 60 నుంచి 70లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఉంటారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో పెద్ద ఎత్తున ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన వారిగా చెబుతున్నారు.

ఎన్నికల సమయంలో తమ ఆలోచనలకు అనుగుణంగా పోలింగ్ సరళిని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేస్తారని చెబుతున్నారు. అందుకే ఉద్యోగ సంఘాలన్నీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయని చెబుతున్నారు. ఉద్యమాలు, ఆందోళనలతో ఫలితం లేనందునే సమయం వచ్చే వరకు వేచి ఉండాలనే ధోరణిలో ఉద్యోగులు ఉన్నట్టు చెబుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024