AP Govt Employees : ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య జీపీఎస్ లొల్లి, ఆ నలుగురు కట్టప్పలు ఉద్యమాన్ని అమ్మేశారని విమర్శలు
AP Govt Employees : జీపీఎస్ విధానంపై ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య వివాదం నెలకొంది. ప్రభుత్వ పదవులకు ఆశపడి నలుగురు కట్టప్పలు ఉద్యమాన్ని అమ్మేశారని సీపీఎస్ఈఏ నేతలు మండిపడ్డారు.
AP Govt Employees : జీపీఎస్ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జీపీఎస్‌పై ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు చర్చలను సీపీఎస్ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. గత ప్రభుత్వంలో ఇద్దరే కట్టప్పలుంటే ఈ సారి నలుగురు జేఏసీ నాయకులు కట్టప్పలుగా మారి ఉద్యమాన్ని అమ్మేశారని ఏపీ సీపీఎస్‌ఈఏ నేతలు విమర్శించారు. ప్రభుత్వ పదవుల కోసం ఆశపడి జేఏసీ నేతలు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వల్లే చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యిందని సీపీఎస్ఈఏ నేతలు అన్నారు. మిగిలిన ఉద్యోగ సంఘాలు తమను వాడుకుని వదిలేశాయన్నారు. ఓపీఎస్ మినహా మరో ప్రత్యామ్నాయం అంగీకరించమన్నారు. ఓపీఎస్ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. త్వరలో 'వై నాట్ ఓపీఎస్' పేరిట నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతోనే తాము పోరాచం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. జీపీఎస్ బాగుందని చెప్తున్న ఇతర ఉద్యోగ సంఘాలకు అసలు డ్రాఫ్ట్‌లో ఏముందో తెలుసా అని ప్రశ్నించారు.
డీఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం
రాష్ట్ర సచివాలయంలో జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి వర్గ సబ్ కమిటీ మంగళవారం భేటీ అయింది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు. ఇతర ఉద్యోగ సంఘాల నేతలపై తమపై విమర్శలు చేయటం కరెక్ట్ కాదన్నారు. జీపీఎస్ లో 50 శాతం పెన్షన్ గ్యారెంటీ, డీఆర్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. రిటైర్మెంట్ తర్వాత 60 శాతం పింఛన్ వెనక్కి తీసుకోవచ్చన్నారు. సీపీఎస్, జీపీఎస్ లో ఉద్యోగులకు ఆప్షన్ ఉంటుందన్నారు. 10 శాతం ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ఉంటుందని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల మధ్య వివాదాలు అంత మంచిది కాదన్నారు.
మంత్రి బొత్స ఏమన్నారంటే?
ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు చక్కని వాతావరణంలో జరిగాయన్నారు. మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.