Unions Met CM Jagan: ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
Unions Met CM Jagan: ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, సీపీఎస్ స్థానంలో గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ను ప్రకటించిన నేపథ్యంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Unions Met CM Jagan: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్ ప్రకడించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాల సమక్షంలో అధికారులకు సీఎం ఆదేశించారు.
ఉద్యోగులకు సంక్షేమార్ధం కొత్తగా జీపీఎస్ తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు సహా ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఉద్యోగ సంఘాలతో భేటీ సందర్భంగా ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు.
ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. పెన్షన్లు సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపన పడ్డామని వివరించారు. గతంలో ఎవ్వరు ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడ్డ సందర్భాలు లేవని సిఎం జగన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతే కాకుండా భావితరాలను కూడా దష్టిలో ఉంచుకోవాలనే ఉద్దేశంతో పనిచేసినట్లు చెప్పారు.
ఉద్యోగుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని జిపిఎస్ తీసుకువచ్చామన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్ రూపొందించినట్లు చెప్పారు. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండేలా గ్యారంటీ కల్పించినట్లు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామన్నారు.
ఉద్యోగులకు న్యాయం జరగాలి, ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలని ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో లేని సదుపాయలు కూడా జీపీఎస్‌లో ఉన్నాయని చెప్పారు. రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘకసరత్తు చేసిందని, ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేసినట్లు వివరించారు.
కాంట్రాక్ట్‌ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశామని, సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశామన్నారు.