AP Employees Issue: ఎటూ తేల్చని భేటీ… ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమబాట యథాతథం… ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
AP Employees Issue: ఉద్యోగుల డిమాండ్లపై ఏపీ సచివాలయంలో జరిగిన సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు కొనసాగుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
AP Employees Issue: సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు జరపాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు భేటీ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిర్దిష్ట హామీ లభించకపోవడంతో ఉద్యమకార్యచరణ కొనసాగుతుందని ప్రకటించాయి. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.20 వేల కోట్ల వరకు ఉంటుందని తేల్చారు. వీటిలో రూ.5,500 కోట్లను ఈ నెలాఖరు, లేదా మార్చి 31 నాటికి చెల్లిస్తామని మంత్రులు ప్రకటించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను వెల్లడించింది. వీటిని ఇప్పటికిప్పుడు పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని తేల్చేసింది.
ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న మధ్యంతర భృతి మాత్రం సీఎం జగన్‌తో చర్చించి మరోసారి చెబుతామని మంత్రుల కమిటీ ప్రకటించింది. 2023 కన్నా ముందు నియామకం పొందిన వారికి కూడా ఓపీఎస్ వర్తింప చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమావేశంలో కొత్తదనం ఏమీ లేదని కాకపోతే తమకు ప్రభుత్వం ఎంత బకాయిలు చెల్లించాల్సి ఉందో మాత్రం ప్రభుత్వంతో చెప్పించామని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
బకాయిలు రూ.20 వేల కోట్లు: బొప్పరాజు
మంత్రివర్గ ఉప సంఘం జరిపిన చర్చల్లో కొత్త దనం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం రూ.20 వేల కోట్ల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిలో కొంత భాగం మార్చి 31, జూన్‌లో చెల్లిస్తామన్నారని హామీ ఇచ్చారని బొప్పరాజు తెలిపారు.
జీపీఎఫ్ బకాయిలు రూ.940 కోట్లలో రూ.60 కోట్లు క్లాస్ ఫోర్ ఉద్యోగులకు చెల్లించినట్టు తెలిపారని బొప్పరాజు వివరించారు. మిగిలిన డబ్బులు మార్చి 31న చెల్లిస్తామని చెప్పారన్నారు. ఏపీజీఎల్‌ఐ బకాయిలు రూ.313 కోట్లు అప్‌లోడ్ అయ్యాయని, మరో రూ.200 కోట్లు అప్‌లోడ్ కావాల్సి ఉందని చెప్పారు.
టీఏ, డీఏ బకాయిలు పోలీసువారికి ఇతర ఉద్యోగులకు కలిపి రూ.274 కోట్లు చెల్లించాల్సి ఉందని, పోలీసులకు చెల్లిస్తామని చెప్పారని మిగిలిన ఉద్యోగులకు మార్చికి వాయిదా వేశారని అన్నారు. సరెండర్ లీవులు, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ బకాయిలు మొత్తం రూ.2,250 కోట్లు ఉన్నాయన్నారు. జూన్ నాటికి కొంత మొత్తం చెల్లిస్తామని చెప్పారన్నారు.
2020, 2021 సంవత్సరం సరండర్ లీవులు రూ.300 కోట్లు మార్చి నెలాఖరునాటికి చెల్లిస్తామని చెప్పారన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రూ.2,800 కోట్లు వారి ఖాతాల్లో మార్చిలో జమ చేస్తామని చెప్పినట్టు తెలిపారు. ఎంతెంత బకాయిలు చెల్లించాలనే వివరాలు ప్రభుత్వం నుంచి తెలుసుకోగలిగామన్నారు.
యథాతథంగా ఉద్యమం…
మంత్రుల కమిటీతో జరిగిన సమావేశం తమకు నిరుత్సాహం కలిగించిందని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. జేఏసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఈ నెల 14 నుంచి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. మధ్యంతర భృతి విషయంలో ప్రభుత్వం స్పందించలేదన్నారు. 14వ తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో మొదలయ్యే తమ ఆందోళన 27న ‘చలో విజయవాడ’తో ముగుస్తుందని తెలిపారు.
గడువు కోరామన్న మంత్రి బొత్స…
ఉద్యోగ సంఘాల డిమాండ్లలో కొన్నింటి పరిష్కారం కోసం గడువు కోరినట్లు, మరికొన్నింటికి హామీ ఇచ్చినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2, 3 అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు. ఈ నెల, వచ్చే నెలలో రూ.5,500 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని తెలిపారు.
ఉద్యోగుల పీఆర్సీ వీలైనంత త్వరగా ప్రకటించాలని భావిస్తోందన్నారు. ఉద్యోగ సంఘాలు ఐఆర్ కోరాయని దానిపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి చెబుతామని అన్నారు. హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియో, రమణయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి చెప్పారు.