AP Employees Unions: డిమాండ్లను పరిష్కరించినందుకు సిఎంకు ఉద్యోగ సంఘాల సన్మానం
AP Employees Unions: ఏపీలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న ఉద్యోగ సంఘాలు రూటు మార్చేశాయి. పోటీలు పడి మరీ సిఎంకు సన్మానాలు చేస్తున్నాయి. మంత్రి వర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలు ఫలించడంతో ఉద్యోగ సంఘాలు వరుసకట్టి సిఎంకు కృతజ్ఞతలు చెప్పే పనిలో పడ్డాయి.
AP Employees Unions: ప్రభుత్వంతో జరిపిన సఫలం కావడంతో ఉద్యోగ సంఘాలు ఖుషీ అవుతున్నాయి. వరుసపెట్టి ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని అభినందించే పనిలో పడ్డాయి. గతవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో బకాయిలు చెల్లింపు, పిఆర్సీ సవరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణతో పాటు పలు అంశాలపై స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు కూడా సానుకూలంగా స్పందించాయి. సీపీఎస్ స్థానంలో జిపిఎస్ ప్రవేశపెట్టడానికి అమోదం తెలిపాయి. దీంతో ఉద్యోగ సంఘాలు సిఎంకు ధన్యవాదాలు చెప్పేందుకు పోటీ పడుతున్నాయి.
మంగళవారం ఏపీజేఏసీ అమరావతి నాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసిన పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. 60రోజుల వ్యవధిలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సిఎం హామీ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.
సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకు రావడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం మనాసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని సీఎం ఉద్యోగ సంఘాల నాయకులకు వివరించారు. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించనక్కర్లేదని హామీ ఇచ్చారు.
ఉద్యోగులకు బాగుండాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని, ఉద్యోగుల సమస్యలను వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఉద్యోగులకు మంచి జరగాలని, రాష్ట్ర ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేసినట్లు వివరించారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామన్నారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్‌లు జీపీఎస్‌లో ఇస్తున్నామని చెప్పారు.
జీపీఎస్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని విశ‌్వాసం వ్యక్తం చేశారు. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందని, ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని ఆదేశించారు.ఇందులో ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. డైలీ వేజెస్ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని సిఎం అధికారులకు ఆదేశించారు.