AP Govt Employees : ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటన, రేపు చర్చలకు రావాలన్న ప్రభుత్వం
AP Govt Employees : ఏపీ ఎన్జీవో జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం చర్చలు పిలిచిందని, రేపు మంత్రుల బృందంతో భేటీ అవుతున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు.
AP Govt Employees : పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు ఏపీ ఉద్యోగ సంఘాలతో రేపు మంత్రుల బృందం భేటీ కానుంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె బాట పడతామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెండింగ్ డీఏలు, రిటర్మైంట్ బెనిఫిట్స్ తో పాటు ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం విజయవాడలో ఏపీ ఎన్జీవో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నాయకత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నా సంఘం నేతలు ఎలాంటి చర్యలను చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాయకత్వం ప్రభుత్వానికి వత్తాసు పలికితే తమ గళం వినిపిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. డీఏలు, సరెండర్ లీవ్ లు, జీపీఎఫ్, ఇతర బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ సమావేశంలో మండిపడ్డారు. ధర్నాలు, ర్యాలీలు, చలో విజయవాడ కార్యక్రమానికి ఏపీ ఎన్జీవోలు నిర్ణయించాయి. సంఘం నేతలు తమతో కలిసి రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు.
రేపు ప్రభుత్వంతో చర్చలు
ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామన్నారు. ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉన్న 104 ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారమని బండి శ్రీనివాసరావు తెలిపారు. ఆ చర్చల్లో ఉద్యమకార్యాచరణ కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించామన్నారు.
14 నుంచి నిరసన కార్యక్రమాలు
ఈ నెల 14వ తేదీ నుంచి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో అన్ని కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఈ నెల 15, 16వ తేదీలలో లంచ్ బ్రేక్ లో నిరసన తెలియజేస్తామన్నారు. ఈ నెల 17న మండల కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా, 21వ తేదీ నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తామన్నారు. 27న చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎలాంటి సమాధానం రాకపోతే మెరుపు సమ్మెకు దిగుతామన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ ఎక్కడుందో తెలియదన్నారు. పీఆర్సీ అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదన్నారు. ప్రతినెల 1వ తేదీకి వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని బండి శ్రీనివాసరావు కోరారు.
ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల అసంతృప్తి
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేసేందుకు వెనుకాడబోమని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు ఇటీవల అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 11వ పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ చెల్లంచలేదని, ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము సకాలంలో అందడంలేదన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము సరైన సమయానికి తీసుకునే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఒకటో తేదీన జీతం, పింఛన్ వస్తాయన్న నమ్మకం ఉద్యోగుల్లో పోయిందని బండి శ్రీనివాసరావు ఆవేదన చెందారు.
సంబంధిత కథనం