Panchayati Funds: సచివాలయాలకు ఆ నిధులు వాడట్లేదు.. ఏపీ ప్రభుత్వ వివరణ
Panchayati Funds: గ్రామ సచివాలయాల నిర్వహణకు పంచాయితీ నిధులు వినియోగించడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Panchayati Funds: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయితీల నిధులను సచివాలయాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. రాష్ట్రంలో 2019 అక్టోబరు 2 నుంచి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 70-100 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున రెండున్నర లక్షలకు పైగా వలంటీర్లను నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికీ నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. అవినీతి, వివక్షకుగానీ తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకటిన్నర లక్షల మందికి పైగా ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించినట్లు వెల్లడించారు.
కొత్తగా ఏర్పాటైన సచివాలయాలకు 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్, 15,002 ప్రింటర్లు, 3,000 ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేశారు. వలంటీర్లతోపాటు ఇతర సచివాలయ సిబ్బంది విధులను వేగంగా నిర్వహించేందుకు టెక్నాలజీని ఉపయోగించేందుకు 2,91,590 స్మార్ట్‌ఫోన్లు, సిమ్‌కార్డులను అందజేసింది. వీటి కొనుగోలు కోసం ప్రభుత్వం తొలిదశలోనే రూ.486.71 కోట్లను వెచ్చించింది. ఇందుకు కూడా గ్రామపంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదని ధృవీకరించారు.
సచివాలయాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వం అదనంగా నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. 'జగనన్న సురక్ష శిబిరం' నిర్వహణ కోసమే రూ.25 కోట్లు.. అలాగే 'ఆరోగ్య సురక్ష శిబిరం' కోసం రూ.22 కోట్లను విడుదల చేసింది. క్యాంపుల నిర్వహణకు అదనంగా రూ.16 కోట్లను మంజూరు చేయగా వాటిని చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.
నాలుగేళ్లలో సచివాలయాల నిర్వహణకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటివరకు రూ.228 కోట్లు వెచ్చించింది. ఈ నిధులతో ప్రింటర్లు, కంప్యూటర్లు, యుపీఎస్, ఫోన్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్ల నిర్వహణను చూస్తోంది. వీటికి పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదని తెలిపారు.
అన్ని సచివాలయాలకు ఫైబర్‌నెట్ సంస్థ ద్వారా ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని ప్రభు త్వం కల్పించింది. ప్రింటర్ల వినియోగంలో వాడే ఇంక్ రీఫిల్స్, స్టేషనరీ సర్టిఫికెట్లు, లామినేషన్ కవర్లను సైతం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. వలంటీర్లతో పాటు ఇతర సచివాలయాల సిబ్బంది ఉపయోగించే ఫోన్ల నెలవారీ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. వీటికి కూడా పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదని ఏపీ ప్రభుత్వంస్పష్టం చేసింది.
సచివాలయాల్లో ఇతర అదనపు ఖర్చుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటిదాకా రూ.25 కోట్లను ఖర్చుపెట్టిందని, ఇతర అవసరాల కోసం కలెక్టర్ల ద్వారా అభ్యర్థనలు పంపితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలించి నిధులు విడుదల చేస్తోందని, వీటికీ పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదని తెలిపారు.
గ్రామ సచివాలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో 10,893 గ్రామ సచివాలయ భవనాలను మంజూరు చేస్తే, వాటిలో ఇప్పటికే 5,926 పూర్తయ్యాయి. వార్డు సచివాలయాల అద్దె చెల్లింపుల కోసం ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.54,56,49,999 చెల్లించారు. కొన్ని చోట్ల సొంత భవనాలు సమకూరడంతో 2023-24 సంవత్సరానికి రూ.25,30,21,000 చెల్లించనున్నారు.
గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కోసం ఆయా గ్రామ పంచాయతీల తీర్మానాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చుచేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులుగానీ, గ్రామ పంచాయతీ సాధారణ నిధులుగానీ ఏ అవసరానికి ఎంతెంత శాతం ఖర్చుపెట్టాలన్న దానిపై ఖచ్చితమైన నిబంధనలున్నాయని, ఇందులో ఎక్కడా కూడా పంచాయతీ నిధులను సచివాలయాల కోసం కేటాయించ లేదని చెబుతున్నారు.
గ్రామ సచివాలయాల నిర్వహణకు ఆ శాఖ ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నందున, నిర్వహణ ఖర్చుల నిమిత్తం అధికారుల నుంచి పంచాయతీ కార్యదర్శులపై ఎలాంటి ఒత్తిడి లేదని చెబుతున్నారు.