తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Avinash Reddy On Cbi : సీబీఐ విచారణ వ్యక్తి లక్ష్యంగా సాగుతోంది.. !

Avinash Reddy on CBI : సీబీఐ విచారణ వ్యక్తి లక్ష్యంగా సాగుతోంది.. !

HT Telugu Desk HT Telugu

24 February 2023, 19:39 IST

    • Avinash Reddy on CBI : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని రెండోసారి విచారించింది. దాదాపు 5 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాశ్... విచారణ వ్యక్తి లక్ష్యంగా సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

Avinash Reddy on CBI : సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది. ఈ కేసులో జనవరి 28న తొలిసారి అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ... ఇవాళ (ఫిబ్రవరి 24) రెండోసారి సుమారు 5 గంటల పాటు ప్రశ్నించింది. ఫోన్ కాల్స్, కాల్ డేటాపై ఆరా తీసినట్లు సమాచారం. వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని కూడా సీబీఐ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విచారణ తర్వాత సీబీఐ ఆఫీసు నుంచి బయటికొచ్చిన అవినాశ్ రెడ్డి.... సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తి లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోందనే సందేహాం కలుగుతోందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

విచారణ తర్వాత సీబీఐ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడిన అవినాశ్ రెడ్డి... దర్యాప్తు బృందం అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. ఈ కేసులో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలా చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ విజయమ్మ వద్దకు వెళ్లి బెదిరించి వచ్చానని ప్రచారం చేశారని... దుబాయి వెళ్లానని రూమర్లు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రచారం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతోందని అన్నారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచేందుకు... ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా... సీబీఐ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన అవినాశ్ రెడ్డి... వాస్తవాలను కాకుండా వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని విచారణ చేస్తున్నట్లుగా అనిపిస్తోందని అన్నారు. తనకు తెలిసిన నిజాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇచ్చానని... తాను తెలిపిన అంశాలపై కూలంకషంగా విచారణ చేయాలని కోరానని వెల్లడించారు.

"సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు. సీబీఐ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను టీడీపీ ఏడాదిగా ఆరోపిస్తోంది. టీడీపీ ఆరోపణలో ఉన్న వాటినే సీబీఐ తన కౌంటర్ లో లేవనెత్తడం సందేహాలకు తావిస్తోంది. గూగుల్ టేక్ అవుటా.. టీడీపీ టేక్ అవుటా.. అనేదాన్ని కాలమే నిర్ణయిస్తుంది. వాస్తవాల లక్ష్యంగా సీబీఐ విచారణ జరగడం లేదు. వ్యక్తి లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతుందని సందేహం కలుగుతోంది. నేను వెళ్లే సరికి ఘటనా స్థలంలో లేఖ ఉంది... అది ఎందుకు దాచారు ? వివేకా హత్య రోజు మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడా. ఆ తర్వాత రెండ్రోజులకు మీడియాతో మాట్లాడా. అప్పుడేమీ మాట్లాడానో ఇవాళ కూడా అదే చెబుతున్నా. సీబీఐ అధికారులతో కూడా అదే చెప్పా. ఎవరు అడిగినా అదే చెబుతా. సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా. లాయర్లను అనుమతించి ఆడియో, వీడియో రికార్డు చేయాలన్నా. కానీ ఇవాళ జరిగిన విచారణను రికార్డు చేసినట్లు అనిపించలేదు" అని అవినాశ్ రెడ్డి తెలిపారు.